బతుకమ్మ: ప్రత్యేక వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియో సందేశాన్ని శనివారం రోజున విడుదల చేశారు. ‘బతుకమ్మ పండుగ అంటే ప్రతి సంవత్సరం ఎంతో సందడిగా ఉంటుందని, అయితే కరోనా మహమ్మారితో ఎవరింట్టలో వారే మాస్కులు పెట్టుకుని జరుపుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలంతా చాలా ధైర్యంగా, చాలా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూట్యూబ్లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం. మీ అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఒకపక్క కరోనా, మరోపక్క హైదరాబాద్లో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానలు ప్రజలను ఇబ్బంది పెడతావున్నాయి. ఇలాంటి సమయంలో మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ, బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఈ పరిస్థితులను గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వరద నీరు వచ్చినటువంటి వారిని ఆదుకోవడానికి తక్షణ సాయంగా రూ.550 కోట్లను మంజూరు చేయడం చాలా సంతోషదాయకం. హైదరాబాద్ ప్రజల పడుతున్న ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, ఆ గౌరమ్మ తల్లి దయ వల్ల కరోనా కనుమరుగవ్వాలని, మీరందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా` అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక మన బతుకమ్మ పండుగ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు #MyBathukammaMyPride #Bathukamma pic.twitter.com/hYXjEgyFKQ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 24, 2020