బాలు అంత్యక్రియలు పూర్తి
చెన్నై: సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల మధ్య గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చెన్నై శివారులోని ఫామ్ హౌస్‌లో జరిగిన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు.శ్రౌత శైవ ఆరాధ్య సంప్రదాయం ప్రకారం బాలుని ఖననం చేశారు. అంతకు ముందు కుటుంబసభ్యులు సంప్రదాయబద్ధంగా వైదిక క్రతువు పూర్తి చేశారు.
కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు అనుమతించారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలు అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రితో పాటు సూపర్‌స్టార్ విజయ్, భారతీరాజా, దేవిశ్రీ ప్రసాద్, మనో మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు బాలును కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఫాంహౌస్‌కు చేరుకున్నారు.