బీజేపీకి ఓటేస్తే బురదలో వేసినట్లే: హరీశ్‌రావు

రామచంద్రాపురం: కెసిఆర్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధిని ప్రజలు గమనించి టిఆర్ ఎస్ వైపు ప్రజలందరూ నిలవాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆర్సీపురం 112 డివిజన్‌లోని వడ్డెర బస్తీలో, భారతీనగర్ 111 డివిజన్‌లోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాలో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు బూరుగడ్డ పుష్పానగేశ్, సింధూ ఆదర్శ్‌రెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫారుక్‌హుస్సెన్, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఝాటా పార్టీ అయిన బీజేపీని ప్రజలు నమ్మవద్దని, బీజేపీకి ఓటు వేస్తే బురదలో వేసినట్లేనని అన్నారు. ఆర్సీపురం, భారతీనగర్, పటాన్‌చెరు డివిజన్‌ల అభివృద్ధి తన భుజాలపై వేసుకుంటానని, డివిజన్‌లో ఉన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని అన్నారు. అభివృద్ధికి పాటుపడే టీఆర్‌ఎస్‌కే ప్రజలు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. పలువురు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.