బీవండీలో కూలిన భవనం.. 8 మంది మృతి
శిథిలాల కింద చిక్కుకున్న మారో 25 మంది ఫ్లాట్ల నివాసులు
ముంబయి: మహారాష్ట్రలోని భీవండి నగరంలో విషాదం చోటు చేసుకుంది. బీవండీ నగరంలోని 21 ఫ్లాట్లు ఉన్న జిలానీ అపార్టుమెంటు సగం ఆదివారం అర్దరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందగా.. మరో 25 మందిని స్థానికులు రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా మూడు అంతస్తుల 69వనంబరు గల ఈ అపార్టుమెంటును 1984వ సంవత్సరంలో నిర్మించారు. కాగా ఈ ప్రమాదంలో మరో 20నుంచి 25 మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు. స్థానికులు, అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో బీవండీ నగరంలోని పటేల్ కాంపౌండులో గందరగోళం నెలకొంది.
