బెజ్జూర్‌లో పెద్దపులి కలకలం

బెజ్జూరు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు మండలంలో పెద్దపులి కలకలం సృష్టించింది. కుంటలమానేపల్లి గ్రామంలోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ పొలం వద్ద 2 పశువులను పెద్దపులి చంపేసింది. ఈ విషయం తెలిసిన సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ వార్త తెలిసిన అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవరు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. వారం రోజుల కిందట పెంచికల్‌పేట గ్రామంలోని ఓ రైతు ఇంటి ఆవరణలోకి పులి వచ్చింది. ఆవరణలో కట్టేసి ఉన్న ఎద్దుపై దాడి చేసింది. యజమాని పోశయ్య ఇంటి ఆవరణలో పులి కనిపించడంతో గట్టిగా కేకలు వేశాడు. దీంతో పులి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు పులి 30కిపైగా పశువులను బలి తీసుకున్నట్లు సమాచారం.