భారీ వర్షంతో హైదరాబాద్‌లో రోడ్లు జలమయం
హైదరాబాద్ : హైదరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలు కురిసాయి. ఉరుములు, మెరుపులతో కురిసిన కుండపోతతో నగర వీధులు చెరువును తలపించాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, కోఠి, దిల్‌సుక్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, తార్నాక, నాంపల్లి, అబిడ్స్, మెహదీపట్నం, అత్తాపూర్, అబిడ్స్, బేగంపేట్, ఖైరతాబాద్, పాతబస్తీ, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, లంగర్‌హౌస్, షేక్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

భారీవర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులపై భారీగా వరద నీరుచేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నగరంలోని కుషాయిగూడ ఏఎస్‌రావునగర్‌లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ప్రజలు చూస్తుండగానే రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. రోడ్డు కుంగడంతో వాహనదారులు ప్రమాదానికి లోనవకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ రోడ్డుపై ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు కుంగిన రోడ్డును పరిశీలించారు. భారీ వర్షాలతో జిహెచ్ ఎంసి అధికారులు సహాయకార్యక్రమాలు ముమ్మరం చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైన వర్షపాతం వివరాలుః
అత్యధికంగా అత్తాపూర్ 10.4, షేక్‌పేట్ 10.3, మణికొండ 9.8 సెం.మీ. వర్షపాతం నమోదు.
ఫిలింనగర్ 9.7, రాజేంద్రనగర్ 9.6, టోలిచౌకి 9.6, గండిపేట్ 9.4 సెం.మీ. వర్షపాతం.
ఉప్పల్, శ్రీనగర్ కాలనీ, శేరిలింగంపల్లిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు.
అబ్దుల్లాపూర్‌మెట్ 8.8, షేక్‌పేట్ 8, ఆసిఫ్‌నగర్ 7.5 సె.మీ. వర్షపాతం.