భారత్లో 75 లక్షల మంది కోలుకున్నారు!
దేశంలో కొత్తగా 46,964 కొవిడ్ కేసులు

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ రెండోసారి విజృంభిస్తున్నప్పటికీ… భారత్లో మాత్రం తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 46,964 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 81,84,083కు చేరాయి. తాజాగా 470 మంది మృతి చెందగా.. 1,22,111 మంది ఇప్పటి వరకు మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 5,70,458 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఇప్పటి వరకు 74,91,513 మంది కోలుకున్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. శనివారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 10,31,239 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 10,98,87,303 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది. మరోవైపు రికరీ రేటు పెరుగుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. దాదాపు 91.34 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 7.16 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.49 శాతానికి తగ్గిందని బులిటెన్లో పేర్కొంది.