భారత్ టీకాల కోసం ప్రపంచం ఎదురు చూపు: ప‌్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప‌్రపంచ ప్రజలను రక్షించేందుకు రెండు వ్యాక్సిన్‌లతో ఇండియా సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. యావత్ ప్రపంచం భారత్‌వైపు చూస్తోందని మోడీ పేర్కొన్నారు. 16వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును ఉద్దేశించి ఇవాళ ఉదయం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కరోనా ప్రభావం మొదలైన కొత్తలో భారత్ పీపీఈ కిట్‌లను, మాస్కులను, వెంటిలేటర్‌లను, టెస్టింగ్ కిట్‌లను బయటి నుంచి దిగుమతి చేసుకునేదని, కానీ ఇప్పుడు ఆ విషయంలో మన దేశం స్వావలంబన సాధించిందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ సంస్థలు తయారు చేసిన రెండు వ్యాక్సిన్‌లతో మానవాళిని రక్షించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
నేడు ప్రపంచంలోనే ఎక్కడున్నా సరే మనమంతా ఇంటర్నెట్ సాయంతో కలిసే ఉంటున్నాం అన్నారు. విదేశాల్లో ఉన్న ప్రవాసి భారతీయులకు ప్రభుత్వం, దేశం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్న 45 లక్షల మందిని వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తీసుకొచ్చాం అని మోడీ తెలిపారు.