మంత్రి కుమారుడికి బెంజ్ కారు లంచం :
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం: ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ 11440కు కాల్ చేసి మంత్రి కుమారుడు ఈశ్వర్‌పై ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టయిన ఎ14గా ఉన్న కార్తీక్ అత్యంత ఖరీదైన బెంజ్ కారును మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు పుట్టిన రోజు కానుకగా ఇచ్చారని అన్నారు. మంత్రి కుమారుడికి ఇచ్చింది పుట్టిన రోజు కానుక కాదని, లంచం అని ఆరోపించారు. మంత్రి జయరాంకు కార్తీక్ బినామీ అని, ఏ సంబంధంతో ఖరీదైన కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి జయరాంతో రాజీనామా చేయించాలని అన్నారు. కార్మిక శాఖలో అవినీతికి పాల్పడింది అచ్చెన్నాయుడు కాదని, మంత్రి జయరామేనని ఆరోపించారు. ఆధారాలతో నిరూపిస్తానని, దీనిపై విచారణ జరిపించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా? అని ప్రశ్నించారు.