మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ (CLiC2NEWS): మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మహారాష్ట్రలోని మరాఠ సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మరాఠా రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని, ఆర్ధిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని, ఇప్పటికే 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సుప్రీం కోర్టు పేర్కొన్నది.
2018లో మరాఠాలకు మహారాష్ట్ర సర్కార్ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 16శాతం రిజర్వేషన్ కల్పించిందింది. దీన్ని వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన కోర్టు రిజర్వేషన్లను సమర్థిస్తూ 2019లో తీర్పు వెలువరించింది.
కోటాను 16 శాతం నుంచి విద్యాసంస్థల ప్రవేశాల్లో 12 శాతానికి, ఉద్యోగ నియమాకాల్లో 13 శాతానికి తగ్గించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పులు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తుది తీర్పును వెలువరించింది.