మా కుటుంబంపై దాడి చేసింది ఎవరు: రైనా

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కుటుంబ సభ్యుల్లో ఒకరు కన్నుమూశారు. ఈ విషయాన్ని రైనా ట్విట్టర్‌లో తెలుపుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్న టీమిండియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా ఎట్టకేలకు మౌనం వీడాడు. తమ కుటుంబంలో చోటుచేసుకున్న తీవ్ర విషాదం గురించి ట్విటర్‌ వేదికగా మంగళవారం స్పందించాడు. వ్యక్తిగత కారణాలతోనే యూఏఈ నుంచి వెనక్కి వచ్చినట్లు వెల్లడించాడు. ఈ మేరకు ‘‘పంజాబ్‌లో మా కుటుంబంపై భయంకరమైన దాడి జరిగింది. మా అంకుల్‌ను చంపేశారు. మా మేనత్త, నా ఇద్దరు కజిన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. దురదృష్టవశాత్తు గత రాత్రి నా కజిన్‌ ఒకరు ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందారు. తన అత్త ఆరోగ్యం విషమంగా ఉందని రైనా తెలిపాడు

కాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో గల రైనా బంధువుల ఇంటిపై ఆగస్ట్ 29న నలుగురు దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. అర్థరాత్రి నిద్రిస్తున్నసమయంలో అకస్మాత్తుగా దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేశారు. ఇతర కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచారు. అసలా రోజు రాత్రి ఏమైందో ఇప్పటికి తెలియడం లేదని, దాడికి పాల్పడ్డ వారిని గుర్తించాలని పంజాబ్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ఈ క్రూరమైన చర్యకు పాల్పడ్డ వారిని వెంటనే పట్టుకోవాలని.. వారు మరిన్ని దాడులకు పాల్పడకుండా అడ్డుకోవాలని కోరాడు.

 

 

 

Comments are closed.