మీ సేవ కేంద్రాల్లో వరదలా బాధితులు

హైదరాబాద్‌: న‌గ‌రంలో ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా న‌ష్ట‌పోయిన బాధితులు ప్ర‌భుత్వం అందించే సాయం కోసం మీ సేవ కేంద్రాల‌కు బారులు తీరుతున్నారు. ముంపున‌కు గురైన బాధితుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ‌ర‌ద‌ల స‌మ‌యంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు బాధితుల‌కు స్వ‌యంగా ఆర్ధిక సాయం అంద‌జేశారు. కాగా కొన్ని చోట్ల సాయం అంద‌డం లేద‌ని ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌భుత్వ సొమ్మును కొంద‌రికి మాత్ర‌మే అంద‌జేశార‌ని బాధితులు ఆందోళ‌నకు దిగారు. దీంతో ప్ర‌భుత్వం సాయం అంద‌ని బాధితులెవరైనా మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఖాతాల్లో నగదు జమచేస్తామని సూచించింది. దీంతో కూలీ పనులు, రోజువారీగా చేసే వృత్తులను మానుకుని మీ-సేవ సెంటర్ల ముందు జనం పోగయ్యారు. సోమవారం దరఖాస్తు చేసుకున్న 6,263 మందికి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమచేశారు. దరఖాస్తులు అందజేసిన ఒక్క రోజే రూ.50 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. దరఖాస్తు చేసిన వెంటనే డబ్బులొస్తున్నాయని తెలియడంతో నగరంలోని ఆయా ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకోని ప్రజలంతా మీ-సేవ కేంద్రాలకు తరలివెళ్లారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడంతో ఆలస్యం చేస్తే ఖాతాల్లో డబ్బులు పడవేమోననే ఆందోళనతో కూడా పనులు మానుకొని క్యూ కట్టారు. కొంతమంది తమ పిల్లలను ఉదయం 6 నుంచే కేంద్రాల్లో క్యూలైన్‌లో నిలబెట్టినట్లు తెలిసింది. అనంతరం ఇంట్లోని పెద్దలు ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌, కరెంట్‌ బిల్లు జిరాక్స్‌ను పట్టుకుని వెళ్లి పిల్లల స్థానంలో నిలబడ్డారు. నగర వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో మొత్తంగా 11,650 మంది దరఖాస్తు చేసుకున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. నగరంలో వరద సాయం కింద ఇప్పటివరకు ఆరు లక్షల కుటుంబాలకు రూ.600 కోట్ల సాయాన్ని అందించినట్లు సమాచారం.
న‌గ‌రంలోని ఎల్బీన‌గ‌ర్, వ‌న‌స్థ‌లిపురం, సికింద్రాబాద్‌, సీతాఫ‌ల్ మండి, శేరిలింగంప‌ల్లి ప‌రిధిలో, అంబ‌ర్‌పేట‌, గోల్నాకా, చందాన‌గ‌ర్‌, స‌న‌త్‌న‌గ‌ర్‌, మారేడ్ప‌ల్లి, ఖైర‌తాబాద్‌, కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని మీ సేవ కేంద్రాల‌కు మ‌హిళ‌లు, వృద్ధులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.