మొద‌లైన సచివాలయ పరీక్షల సందడి

గుంటూరు : రాష్ట్రమంతా నేడు సచివాలయ పరీక్షల సందడి నెలకొంది. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ సచివాలయ ఉద్యోగ పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు వారి వారి పరీక్షా కేంద్రాలకు వెళ్లి తమ రోల్‌ నెంబర్లను చెక్‌ చేసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో.. అధికారులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. మొత్తం 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాతపరీక్షలు ఆరంభం అయ్యాయి. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోపే గతేడాది దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో ఏడాది కూడా పూర్తికాక ముందే మరోసారి భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
నేటి నుంచి 26 వరకు రాతపరీక్షలు
రాష్ట్రంలో ఆదివారం నుంచి ఈ నెల 26 వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి రాతపరీక్షలు జరుగుతాయి. 19 కేటగిరీల్లో రోజుకు రెండు పరీక్షల చొప్పున నిర్వహిస్తారు. మొత్తం 2,221 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ఒకరికొకరి మధ్య ఆరడుగుల దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాటు చేశారు. బెంచ్‌కు ఒకరి చొప్పున ప్రతి పరీక్ష గదిలో 16 మంది అభ్యర్థులను మాత్రమే ఉంచుతారు. రాతపరీక్షకు ముందు, పరీక్ష అనంతరం అన్ని పరీక్ష కేంద్రాలను సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శానిటైజ్‌ చేయిస్తున్నా మని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. ప్రతి పరీక్ష గది ముందు శానిటైజర్‌ స్టాండ్‌లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కరోనా అనుమానిత లక్షణాలున్నవారికి ప్రత్యేక ఐసోలేషన్‌ గదులు ఏర్పాటు చేశామని చెప్పారు. రోజూ ఉదయం జరిగే పరీక్ష పది గంటలకు, సాయంత్రం పరీక్ష మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమవుతాయన్నారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యం అయినా రాతపరీక్షకు అనుమతించబోమని చెప్పారు.
కాగా గుంటూరులో జిల్లాలో 223 కేంద్రాల్లో సచివాలయ ఉద్యోగ పరీక్షలను చేపట్టనున్నారు. మంగళగిరి మండలంలోని 3 కేంద్రాల్లో ఈ రోజు నుంచి 26 వ తేదీ వరకు సచివాలయ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో.. జిల్లా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మంగళగిరి మండలంలోని నిర్మలాలో రెండు, డాన్‌ బాస్కో స్కూల్‌, మరొక సెంటర్‌ లో పరీక్షలు కొనసాగుతాయని, జిల్లా వ్యాప్తంగా 36 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే విజయనగరంలో సచివాలయ ఉద్యోగాల పరీక్షలు రాసేందుకు వస్తున్న అభ్యర్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి, శానిటైజర్‌ను రాసి, హాల్‌ టికెట్స్‌ చూసి పరీక్షా కేంద్రం లోపలికి పంపిస్తున్నారు. పరీక్షా కేంద్రం వద్ద కోవిడ్‌ పేషెంట్ల కోసం ఐసొలేషన్‌ సెంటర్‌ను సిబ్బంది ఏర్పాటు చేశారు. మరోవైపు బొబ్బిలిలోని రాజా కాలేజ్‌ పరీక్ష కేంద్రం వద్ద సచివాలయ అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. ఓ వికలాంగ విద్యార్థిని కానిస్టేబుల్‌ తన వాహనంపై ఎక్కించుకొని పరీక్షా కేంద్రానికి చేర్చి ఔదార్యాన్ని చాటారు. గజపతినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సచివాలయ పరీక్షలకుగాను.. కరోనా నేపథ్యంలో శానిటైజేషన్‌ చేయడం, థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయడం వంటి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయ పరీక్ష అభ్యర్థులు తమ రోల్‌ నెంబర్‌ ను చెక్‌ చేసుకుంటున్నారు. పరీక్షలు రాసేందుకు వస్తున్న అభ్యర్థుల కోసం దేవి కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద హెల్ప్‌ డెస్క్‌ ను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్దకు వస్తున్న అభ్యర్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌ చేస్తూ వారి హాల్‌ టికెట్లను రెవెన్యూ సిబ్బంది పరిశీలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.