యాప్‌లపట్ల అప్రత్తంగా ఉండాలి..

ముఖ్యంగా రుణాలు తీసుకునే విద్యార్థులనే టార్గెట్ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు….
ఈ యాప్‌ల ముసుగులో మీ ఫోన్‌లోకి ప్రవేశించి.. కాంటాక్ట్స్‌లోని నంబర్లను తస్కరిస్తున్నారు. ఆ తర్వాత రుణం తీసుకున్న మూడు రోజుల తర్వాత డబ్బుల కోసం వేధిస్తున్నారు. వీరి బాధను తట్టుకోలేక ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసినా.. సిమ్‌ చేంజ్‌ చేసినా.. మీ కాంటాక్ట్స్‌లో ఉన్న వారిని వేధిస్తున్నారు. దీనికితోడు వచ్చిరాని ఆంగ్లంలో లీగల్‌ నోటీసు అంటూ పంపించి భయాందోళనకు గురి చేస్తున్నారు. తక్కువ మోతాదులో ఇచ్చి.. డాటా చోరీకి పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు.

చిన్ని చిన్న రుణాలు యాప్‌ల ద్వారా తీసుకుంటున్నారా.. జాగ్రత్తాగా ఉండండి! సైబర్‌ నేరగాళ్లు.. ఈ రుణాలు తీసుకునే విద్యార్థులను టార్గెట్‌ చేశారు. గార్డియన్‌గా ఉన్నారని డమ్మీ లీగల్‌ నోటీసులతో బెదిరిస్తున్నారు.

ఎల్బీనగర్‌ ప్రాంతానికి చెందిన టింకు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అత్యవసరంగా డబ్బులు అవసరం పడటంతో.. చిన్న రుణాలు ఇచ్చే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. దాదాపు రూ.3 వేలు తీసుకున్నాడు. అయితే.. రుణం తీసుకునే ముందు.. 15 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలనే ఒప్పందం ఉంది. అయితే.. తీసుకున్న మూడో రోజు నుంచే…వడ్డీ ఇంత అయింది.. రెండు రోజుల్లో చెల్లించాలి, లేకపోతే అది మూడింతలు అవుతుందని మెసేజ్‌లు, ఫోన్‌లలో బెదిరించారు. ఆందోళన చెందిన టింకు ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేశాడు. ఆ మరుసటి రోజు టింకు బంధువు నంబర్‌కు మెసేజ్‌ పంపించారు. అందులో టింకు మీ ఫోన్‌ నంబర్‌ను గార్డియన్‌గా పెట్టి రూ.3 వేల రుణం తీసుకున్నాడు… అది ఇప్పుడు 12 వేలకు చేరింది. కట్టకపోతే మీపై పోలీసు కేసు పెడుతామని హెచ్చరించారు. అయితే.. టింకు బంధువు.. దాన్ని పట్టించుకోలేదు.

మరుసటి రోజు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి.. టింకు రుణం మీరు చెల్లించాలి.. లేదంటే న్యాయ విచారణ ఎదుర్కోవాలని బెదిరించాడు. నేను ఏ రుణం తీసుకోలేదు.. మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండని జవాబు ఇచ్చాడు. అయితే.. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి హిందీలో తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. ఆ తర్వాత సరిగ్గా పదాలు లేని ఆంగ్ల భాషలో ఓ లీగల్‌ నోటీసుకు సంబంధించి మెసేజ్‌ పంపించాడు. దీంతో భయపడిన టింకు బంధువు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక దర్యాప్తులో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసే సమయంలోనే.. ఫోన్‌ను వారి ఆధీనంలోకి వచ్చే విధంగా ఏదో వైరస్‌ లేదా కోడ్‌ను డౌన్‌ చేయించినట్లు అనుమానించారు. దీని ఆధారంగా వారు రుణం తీసుకున్న వ్యక్తి ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ను చోరీ చేసి .. బెదిరించారని గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

యాప్‌లపట్ల అప్రత్తంగా ఉండాలి..
సైబర్‌ నేరగాళ్లు.. చిన్న చిన్న రుణాల ముసుగులో విద్యార్థులను టార్గెట్‌ చేశారు. రుణం తీసుకునే సమయంలో వివరాలను నమోదు చేసే క్రమంలో ఏదో లింక్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను క్లిక్‌ చేయిస్తున్నారు. దీని ద్వారా రుణం తీసుకున్న విద్యార్థి ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ను అపహరించి.. ఆ రుణానికి కాంటాక్ట్స్‌లో ఉన్న వారిని టార్గెట్‌ చేసుకుని.. గార్డియన్‌గా పెట్టారని బెదిరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా లీగల్‌ నోటీసును తలపించే ఓ పత్రాన్ని పంపి భయం పుట్టిస్తున్నారు. దీంతో కొంతమంది ఫిర్యాదులు ఇవ్వకుండానే.. లీగల్‌ నోటీసుకు భయపడి డబ్బులు చెల్లిస్తున్నారు. ఇలా చిన్న చిన్న రుణాలు ఇచ్చే యాప్‌లు.. వేల సంఖ్యలో ఉన్నాయి.. వీటి కార్యాలయాలు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించాం. తక్కువ రుణమే కదా అని వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోకండి.. అది భారమై పెద్ద రుణంగా మారుతుంది. ఇలాంటి యాప్‌పట్ల అప్రమత్తంగా ఉండాలి. -హరినాథ్‌, ఏసీపీ, రాచకొండ సైబర్‌ క్రైం.

Leave A Reply

Your email address will not be published.