రాజకీయాలపై వీలైనంత త్వ‌ర‌గా నిర్ణ‌యం: రజనీకాంత్‌

చెన్నై: త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ రాజకీయ ప్ర‌వేశంపై సందిగ్ధ‌త ఇంకా తొల‌గ‌లేదు. `ర‌జ‌నీ మ‌క్క‌ళ్ మండ్రం` జిల్లా కార్య‌ద‌ర్వుల‌తో ర‌జ‌నీకాంత్ సోమ‌వారం భేటీ అయ్యారు. దీంతో రాజ‌కీయ ప్ర‌వేశంపై కీల‌క ప్ర‌క‌ట‌న ఉండొచ్చ‌ని అభిమానులు ఆత్కంఠ‌గా ఎదురుచూశారు. అయితే వారికి మ‌ళ్లీ నిరాశే ఎదురైంది. కాగా రాజ‌కీయ ప్ర‌వేశంపై వీలైనంత త్వ‌ర‌గా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తాన‌ని సమావేశం అనంత‌రం ర‌జ‌నీ ప్ర‌క‌టించారు.

త్వరలో తమిళనాడులో శాసనసభకు ఎన్నికలు జరగుతున్న తరుణంలో రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అనే అంశంపై చర్చ జరుగుతూ ఉంది. ఆరోగ్య కారణాల రీత్యా తనను రాజకీయాల్లో రావద్దని డాక్టర్లు సూచించారంటూ రజనీకాంత్‌ లేఖ రాసినట్లు ఒక లేఖ ప్రచారంలోకి వచ్చింది. అది తాను రాసిన లేఖ కాదని చెప్పిన రజినీకాంత్‌ తనకు ఆరోగ్య సమస్య ఉన్నది మాత్రం వాస్తవం అన్నారు. ఈ నేపథ్యంలో రజినీ మక్కల్‌ మండ్రం జిల్లా కార్యదర్శులతో సమావేశం పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

జిల్లా కార్యదర్శులతో సుదీర్ఘ సమయం పాటు చర్చించిన అనంతరం రజినీ బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. జిల్లా కార్యదర్శులు వారి వైపు నుంచి లోటుపాట్లను వివరించారని, తనవైపు నుంచి అభిప్రాయాలను కూడా చెప్పానని, రాజకీయల్లో ఎంట్రీపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ఎన్నో రోజుల నుంచి రజినీ కాంత్‌ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరగుతున్నప్పటికీ ఇంతవరకు రాజకీయపార్టీని ప్రకటించలేదు. కాగా జనవరిలో రజినీ పార్టీని ప్రకటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. కాగా రజనీ పార్టీ పెట్టిన తర్వాత బిజెపితో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరుగుతుండగా ఈ నిర్ణయాన్ని రజినీ మక్కల్‌ మండ్రం జిల్లా కార్యదర్శులు తీవ్రంగా వ్యతిరేకించారు.

Leave A Reply

Your email address will not be published.