రాజ్యసభలో 8 మంది ఎంపీల సస్పెన్షన్

న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులపై ఓటింగ్‌ సందర్భంగా ఆదివారం పార్లమెంట్‌లో చోటుచేసుకున్న గందోరగోళంపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ హక్కుల మర్యాదలకు భంగం కలిగించే విధంగా విపక్ష సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు. రాజ్యసభలో ఘర్షణ పూరితమైన వాతావరణాన్ని కల్పించి డిప్యూటీ చైర్మన్‌ విధులకు ఆటంకం కలిగించారని సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారని గందరగోళానికి కారణమైన ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు విపక్ష ఎంపీలపై అధికార పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానానికి వెంకయ్యనాయుడు సోమవారం ఆమోదం తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో సంజయ్‌సింగ్ (ఆప్), డెరికో ఓబ్రెన్ (టీఎమ్‌సీ), డోలాసేన్ (టీఎమ్‌సీ), రాజీవ్ వాస్తవ్‌ (కాంగ్రెస్) , రిపూన్ బోరా (కాంగ్రెస్) సయ్యద్ నజీర్ హుస్సేన్ (కాంగ్రెస్) , కరీం (సీపీఎం), కేకే రాజేష్ ( సీపీఎం)లో ఉన్నారు.

(వ్యవసాయ బిల్లులు పాస్‌)

సభాసాంప్రదాయాలను సభ్యులు పాటించలేదని సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు. వారం రోజుల పాటు ఈ తీర్మానం అమల్లో ఉండనుంది. మరోవైపు చైర్మన్‌ నిర్ణయంపై విపక్ష పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తున్న బిల్లులపై కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వనందునే తాము నిరసన వ్యక్తం చేశామని చెబుతున్నారు. ఆదివారం బిల్లులపై ఓటింగ్‌ సందర్భంగా సభలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఉపసభాపతి స్థానం వద్దకు వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ నినాదాలు చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రీన్‌ ఆగ్రహంతో డిప్యూటీ చైర్మన్‌ స్థానం వద్దకు దూసుకువెళ్లారు. రూల్‌ బుక్‌ను ఆయన ముఖంపై విసిరేశారు.

(డిప్యూటీ చైర్మ‌న్‌పై ఆవిశ్వాస తీర్మానం!)

సభాపతి స్థానం వద్ద ఉన్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్‌ అడ్డుకున్నారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని తీర్మానాలను ప్రతిపాదించిన డీఎంకే సభ్యుడు తిరుచి శివ, టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రీన్, కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్, సీపీఎం సభ్యుడు కేకే రాగేశ్‌.. తదితరులు బిల్లు పేపర్లను చింపి గాల్లోకి విసిరేశారు. దీంతో సభ్యుల తీరుపై పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసభాపతిని అగౌరపరిచే విధంగా వ్యవహరించిన సభ్యులను సస్పెండ్‌ చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజ్యసభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సోమవారం సభాకార్యక్రమాలు తిరిగి ప్రారంభం అయిన వెంటనే వెంకయ్య నాయుడు ఆమోదం తెలిపారు.

 

సోమ‌వారం పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో నిర‌స‌న తెలుపుతున్న స‌స్పెన్ష‌న్‌కు గురైన 8 మంది ఎంపీలు

 

కాగా సస్పెండ్ అయిన ఎంపీలు బయటికి వెళ్లాల్సిందేనంటూ ఉపసభాపతి స్పష్టం చేయడం.. అందుకు ప్రతిపక్షాలు ససేమిరా అంటున్న నేపథ్యంలో రాజ్యసభ నియమావళిలోని రూల్ నెంబర్ 255 (సభ్యుడిని ఉపసంహరించడం) మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ నిబంధన ప్రకారం… ఎవరైనా సభ్యుడి ప్రవర్తన సరిగా లేదని తనకు అనిపిస్తే అతడిని సభ నుంచి తక్షణమే ఉపసంహరిస్తున్నట్టు చైర్మన్ ఆదేశించవచ్చు. అలాగే బహిష్కరణకు గురైన సభ్యుడు విధిగా ఆ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. వేటు పడిన రోజు మిగతా సభా కార్యకలాపాల్లో పాల్గొనకుండా సదరు సభ్యుడు స్వచ్ఛందంగా గైర్హాజరు కావాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.