రాష్ట్రంలో భారీ వర్షాలు : కేసీఆర్ కీలక ఆదేశాలు
హైదరాబాద్ : రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కోరారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఎం ఆదేశించారు. పరిస్థితులను గమనిస్తూ సహాయ చర్యలు చేపట్టాలని, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ హెచ్చరించారు.
రాష్ట్రంలో నేడు చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళ వారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకస్మికంగా ఈ మధ్య కాలంలో అతి భారీవర్షం కురుస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? అంటే.. దీనికంతటికీ ‘క్యుములోనింబస్’ మేఘాలే కారణమంటున్నారు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు.
ఏపీలోనూ భారీ వర్షాలు: మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. క్రమంగా బలపడి 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.