రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు.. రెడ్ అల‌ర్ట్ జారీ

హైద‌రాబాద్ :భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో 20 సెం.మీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరో రెండు రోజుల పాటు జీహెచ్‌ఎంసీలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. తూర్పు, మ‌ధ్య తెలంగాణ జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్‌, ఉత్త‌ర‌, ప‌శ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్నందున ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే అవకాశం ఉందని.. అదే విధంగా భారీ వర్షాలకు రిజర్వాయర్లు ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖ అప్రమత్తమైంది. 24 గంటలు అందుబాటులో ఉండాలని ఇప్పటికే డీజీపీ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని స్టేషన్ ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు అందాయి. ఏ చిన్న ఆపద వచ్చినా వెంటనే ‘100’కు డయిల్ చేయాలని ప్రజలకు డీజీపీ మీడియా ముఖంగా వెల్లడించారు.

మరో రెండు రోజులపాటు జీహెచ్ఎంసీలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని జీహెచ్ఎంపీ ఓ ప్రకటనలో తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అనవసరంగా ప్రజలెవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ డిజాస్టర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ సూచించారు. ఎంతటి విపత్తు వచ్చిన ఎదుర్కోవడానికి జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉందన్నారు. 90కి పైగా మాన్సూన్, డిజాస్టర్ బృందాలను అందుబాటులో ఉన్నాయని.. పురాతన ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించి, కూల్చివేతలు చేస్తున్నామన్నారు.

ఇప్ప‌టికే కురుస్తున్న కుండ‌పోత వాన‌ల‌కు రాష్ర్టంలోని ప్రాజెక్టుల‌కు, చెరువుల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది. చెరువులు అలుగు పోస్తున్నాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. హైద‌రాబాద్ శివార్ల‌లోని హిమాయ‌త్ సాగ‌ర్‌కు వ‌ర‌ద పోటెత్తింది. దీంతో ఆ ప్రాజెక్టు గేట్లు ఎప్పుడైనా ఎత్తే అవ‌కాశం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో దిగువ ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

 

Leave A Reply

Your email address will not be published.