రూ. కొటి బంగారంతో వెళ్తూ ఇద్దరు వ్యాపారుల మృతి
రామగుండం: పెద్దపెల్లి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామగుండం మండలం మల్యాలపల్లి మలుపు వద్ద కారు అదుపు తప్పిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
పోలీసుల కథనం ప్రకారం. రామగుండం రాజీవ్ రహదారిపై మల్యాలపల్లి మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారు వ్యాపారులు కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ఉన్న సంతోష్ కుమార్, సంతోష్‌లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన ఇద్దరు వ్యాపారులు తెలంగాణలోని వివిధ జ్యూయలరీ దుకాణాలకు బంగారం విక్రయిస్తుంటారు. ప్రమాదం జరిగినప్పుడు వీరి వద్ద కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి.
కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 108 సిబ్బంది కారులో బంగారు ఆభరణాలను గుర్తించి రామగుండం ఎస్ఐ శైలజకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
