రేప్‌ జరగలేదు: ఏడీజీ

లక్నో: గొంతు నులిమి ఊపిరాడ‌కుండా చేయ‌డం వ‌ల్లే హత్రాస్ ఘ‌ట‌న‌లో బాధితురాలు మృతి చెందిన‌ట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్ల‌డించింది. అయితే, అత్యాచారం జ‌రిగిన‌ట్లు ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేద‌ని తెలిపింది. గత నెల 14న పొలంలో పని చేస్తున్న యువతిపై నలుగురు మృగాళ్లు పాశవీకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో రెండు వారాల పాటు మృత్యువుతో పొరాడుతూ మరణించింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ ఏడీజీ లా అండ్‌ ఆర్డర్‌ ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘ఫోరెన్సిక్‌ నివేదికలో వీర్యం కనుగొనడబలేదు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఇప్పటికే స్పష్టం చేసింది. దీన్ని బట్టి రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్పుడు సమాచారం ప్రచారం చేశారని స్పష్టం అవుతోంది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’ అన్నారు.

అలానే గురువారం నాడు బాధితురాలికి సంబంధించి ఓ వీడియో విడుదలయ్యిందని.. ఆమె నాలుక కత్తిరించబడలేదని దీనిలో స్పష్టంగా తెలుస్తుందన్నారు ప్రశాంత్‌ కుమార్‌. ఓ వైపు బాధితురాలిపై గ్యాంగ్‌రేప్‌ జరిగిందంటూ ప్రచారం జరుగుతుండగా.. ఏడీజీ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇక పోస్టు మార్టం నివేదికలో యువతి ఒంటిపై తీవ్రమైన గాయాలున్నట్లు మాత్రమే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఈ ఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.