రైతులు ఎందుకు కేంద్రం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నారు?
కేంద్రప్రభుత్వం 3 రకాల చట్టాలకు సవరణచేసింది.
1. ఇదివరకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు వాటి నిలువలపై పరిమితులు విధించేది. అంటే ఫలానా సరుకు ఫలానా క్వింటాళ్లు లేదా టన్నులు మాత్రమే నిల్వచేసుకోవాలి. అంతకుమించి నిలువ చేసుకోకూడదు. ఇప్పుడు అటువంటి పరిమితులు పూర్తిగా ఎత్తేశారు.
ఆహా…ఎంత మంచి చట్టం, రైతుకే కదా మంచి జరుగుతోంది అనుకునేరు…. అక్కడికే వస్తున్నా చూడండి…
ఈ బిల్లు ప్రకారం సప్లై చైన్ లో రైతులనుంచి రీటైలర్ వరకూ ఎవరు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. నిత్యవసర సరుకుల ధరలు రెట్టింపు అయినపుడు & కూరగాయల ధరలు 50% పెరిగినపుడు మాత్రమే ప్రభుత్వం నిల్వల మీద ఇప్పుడు ఆంక్షలు విదిస్తుంది. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటాం అని బాహాటంగా చెప్పేస్తోంది.
ఈ బిల్లును బాగా అర్థం చేసుకుంటే,
86% చిన్న సన్నకారు రైతులున్న దేశంలో రైతులు తమ పొలంలో పండిన వాటిని సొంతంగా స్టోర్ చేసుకోలేరు. ఎందుకంటే రైతులకు రిలీయన్స్ ఫ్రెష్ లు, హెరిటేజ్ ఫ్రెష్ లు, AC గోడౌన్లు లేవు. కాబట్టి ఎలాగైనా దళారీలకో, కంపెనీలకో ఉత్పత్తి అయిన పంట పాడు అవకుండా తొందరగా అమ్మేస్తారు. ఇక్కడ లాభం పొందేది దళారీలు, కార్పొరేట్ కంపెనీలు మాత్రమే. ఎప్పటిలానే రైతు మోసపోతాడు.
ఎక్కడో ఉన్న గుజరాత్, బాంబే, ఢిల్లీ కంపెనీలు ఆంధ్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కొనుగోలు చేయడానికి వీలులేదు కాబట్టి ఆ బడా కంపెనీలకోసం రైతులకు మేలు చేస్తున్నట్టు ఇంకో సవరణ చేశారు మన కాషాయ దళం. అదే రెండో చట్టం…..
2. రైతులు భారతదేశంలో ఎక్కడైనా సరే తమ పంట ఉత్పత్తులు అమ్ముకునే చట్టం ఇది.
ఒక చిన్న, సన్నకారు రైతు నిజంగా తన పంటను వేరే రాష్ట్రానికి వెళ్లి అమ్ముకుంటాడా? పక్క జిల్లాలోని మార్కెట్ యార్డులోనే అమ్ముకోవడానికి ట్రాక్టర్లు, లారీలకు బాడుగలు ఇచ్చుకోలేక నలిగిపోతున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక సరైన ధర లేక కొన్నిసార్లు అక్కడే పడేసి వస్తున్నాడు. కాబట్టి ఇది రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చేసిన చట్టం కాదు.
మధ్య దళారీలు, కార్పొరేట్ కంపెనీలు దేశంలో & ప్రపంచంలో ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ అమ్ముకోవడానికి ఈ చట్టం ఇది.
ఉదాహరణకు యూరప్ లో టమాటో కిలో 10 డాలర్లు అంటే 750 రూపాయలు సేమ్ టైం భారత్ లో 30 రూపాయలు రేటు ఉన్నప్పుడు, ఎక్కడెక్కడో ఉన్న కార్పొరేట్ కంపెనీలు వచ్చి రైతుల దగ్గర తక్కువ రేటుకు కొని, ఎక్కువ లాభం ఉండే యూరప్ కి అమ్ముకుంటారు కానీ, ఇండియాలో సచ్చినా అమ్మరు.
అది సరే… రైతుకు లాభాలు రాకపోతే కార్పొరేట్స్ కి తన పంటను ఎలా అమ్ముతాడు అనే డౌట్ వస్తోంది కదా… దానికి కూడా మన నాయకులు చట్టం ద్వారా బడాబాబుల ఒక వెసులుబాటు ఇచ్చారు. అదే మూడో చట్టం… కాంట్రాక్ట్ ఫార్మింగ్…
3. రైతులతో కంపెనీలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయడానికి అనుమతులు.
రైతు ముందుగానే ఏ పంట వేయాలో, ఏ ఎరువును వాడాలో అని నిర్దేశించి ఈ కార్పొరేట్ కంపెనీలు రైతులతో 5 సంవత్సరాల వరకూ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఈ అగ్రిమెంట్ లో ఎంత ధర ఉంటే అంతే రైతు తీసుకోవాలి. రాబోయే 5 ఏళ్ల కాలంలో ధరలు పెరిగినా రైతు మాత్రం అగ్రిమెంట్ ప్రకారమే డబ్బు పొందుతాడు కానీ మార్కెట్ రేటు ప్రకారం కాదు.
ఈ కార్పొరేట్ కంపెనీలతో కాంట్రాక్ట్ వ్యవసాయం చేసిన 5 సంవత్సరాల తర్వాత భూమిని చూస్తే పనికిరాని విధంగా రసాయనాలతో నిండిపోయి సారం కోల్పోతుంది. గ్రౌండ్ వాటర్ మొత్తం అయిపోగొట్టేస్తారు. భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల దాకా వ్యవసాయానికి పనికిరాకుండా తయారు అయిపోతుది భూమి.
అలాంటి భూమి ని ఏమీ చేసుకోలేక చివరకు ఆ దళారీలకో, కంపెనీలకో భూముల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన 3 బిల్లులు పైకి రైతుల మంచికోసమే అని అనిపించినా వాటి పర్యవసానాలు భవిష్యత్తులో దారుణంగా ఉండబోతున్నాయి. అందుకే పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలే కాకుండా దేశంలోని చాలా రైతుసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.
నిజంగా రైతుల మంచి కోసమే అయితే ప్రభుత్వం ఈ బిల్లులతో పాటు ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే రైతులు నమ్మేవారు… అవి::
1. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసే కంపెనీ, MS స్వామినాథన్ చెప్పినట్టు, రైతు పెట్టుబడికి 50% అదనంగా సొమ్మును కలిపి మద్దతు ధారగా చెల్లించాలి.
2. రైతు ఉత్పత్తులు కొన్న కంపెనీ ఫారిన్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు కల్పించకూడదు. లేదా భారతదేశంలో ఖచ్చితంగా 70% సేల్ చేయాలి అని నిబంధన తేవాలి.
3. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కేవలం సేంద్రీయ ఎరువులు లేదా జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ ద్వారానే చేయాలి. రసాయనాలు వాడడం బ్యాన్ చేయాలి. లేదంటే కార్పొరేట్లు పిప్పి పీల్చేసిన భూమి రైతులకు దేనికీ పనికిరాదు.
4. ప్రభుత్వమే రైతు ఉత్పత్తులు కొని మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెట్ కమిటీలు, యార్డులపై శ్రద్ధ పెట్టాలి.
5. ప్రతి గ్రామంలో శీతల గిడ్డంగులు, గోదాముల కట్టించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెంచాలి.
6. రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేసే వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
ఇవన్నీ ఏమీ చేయకుండా కార్పొరేట్లకు లాభం చేకూర్చే బిల్లులు పాస్ చేయడం వల్ల రైతులు ఎంతో నష్టపోతారు. రైతు నష్టపోతే సామాన్యుడికి తిండి కూడా దొరకని పరిస్థితి వస్తుంది.
జనాలను మతం మత్తులో ముంచి దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేసే ప్రభుత్వాన్ని కూలదోయకపోతే దేశంలో మట్టి కూడా మిగలదు. ఇది వాస్తవం!
-వెంకటయోగి రఘురామ్