రైల్వే కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

కోల్‌కతా: కోల్‌కతాలోని స్ట్రాండ్ రోడ్‌లోని రైల్వే ఆఫీస్‌లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించారు. మృతుల్లో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఒక పోలీసు అధికారి, రైల్వే అధికారి, ఓ సెక్యూరిటీ గార్డ్‌తో పాటు మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏడు మృతదేహాల్లో ఐదు మృతదేహాలను 12వ అంతస్థులోని ఎలివేటర్‌లో గుర్తించారు. అగ్నిమాపశాఖ సిబ్బంది 25 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎలివేటర్‌ను వినియోగించడం వల్లే విషాదం చోటు చేసుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
సిఎం మమత బెనర్జీ రాత్రి 11 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
అలాగే అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ నిధి నుంచి రూ.2లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాగా రైల్వే కార్యాలయానికి చెందిన భవనంలో అగ్ని ప్రమాదం జరగడంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ విచారం వ్యక్తం చేశారు.