రోడ్డుపక్కన 2 లక్షల కరోనా వ్యాక్సిన్లు!

భోపాల్(CLiC2NWS): ఓవైపు దేశమంతా కరోనా వ్యాక్సిన్ కొరతతో సతమతమవుతుంటే మధ్యప్రదేశ్‌లో మాత్రం రోడ్డు పక్కన కరోనా వ్యాక్సిన్లతో ఉన్న ట్రక్కును వదిలేసి వెళ్లడం కలకలం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని కరేలీ బస్టాండ్ సమీపంలో దాదాసే 2,40,000 కొవాగ్జిన్ డోసులు ఉన్న ట్రక్‌ను ఎవరో వదిలేసి వెళ్లారు. ఆ ట్రక్ చాలా సేపటి నుంచి అక్కడే ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూడగా అందులో కరోనా వ్యాక్సిన్‌ను ఉన్నట్లు గుర్తించారు.
ట్రక్కులో డ్రైవర్, క్లీనర్ ఎవరూ లేరు. ఈ వ్యాక్సిన్ల మొత్తం ఖరీదు రూ. 8 కోట్ల వరకూ ఉంటుందని కరేసీ ఎస్ఐ ఆశిష్ బొపాచె వెల్లడించారు. డ్రైవర్ ఫోన్ నంబర్ తెలుసుకొని ట్రేస్ చేయగా అతని ఫోన్ రోడ్డు పక్కన పొదల్లో దొరికినట్లు చెప్పారు. ట్రక్‌లో ఎయిర్ కండిషన్ పనిచేస్తోందని, దానిని బట్టి వ్యాక్సిన్లన్నీ బాగానే ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. డ్రైవర్, క్లీనర్ కోసం తాము ఇంకా వెతుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.