లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఉండదు: మంత్రి ఈటల

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూకి ఆస్కారం లేదని, ఉండదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. బుధ‌వారం మీడియాతో మంత్రి ఈటల మాట్లాడుతూ.. నగ‌రంతో కరోనా కేసులు పెరుగుతున్నాయ‌ని. అయితే ఎక్కువ మందిలో ఎలాంటి లక్ష‌ణాలు లేవ‌ని మంత్రి తెలిపారు. గ‌తంలో 85 శాతం మంది బాధితుల్లో ల‌క్ష‌ణాలు లేకుండా ఉంటే.. ప్ర‌స్తుతం 95 శాతం మందిలో ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేద‌న్నారు. అయినా ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ర్యాపిడ్‌ టెస్టులతో వెంటనే ఫలితం తెలుస్తోందని, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి వెంటనే కరోనా కిట్‌ ఇస్తున్నట్లు చెప్పారు. రిపోర్టు వెంటనే రావడం వల్ల కాంటాక్టు ట్రేసింగ్‌ సులభమవుతోందన్నారు. టెస్టులను అవసరమైతే లక్ష వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నట్లు ఈటల తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో టెస్టులు, వ్యాక్సినేషన్‌ కొనసాగుతోందన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఐసోలేషన్‌ సెంటర్లూ అందుబాటులో ఉన్నాయన్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిని విధిగా మానిటర్‌ చేస్తున్నట్లు చెప్పారు.

కరోనా చికిత్సను ప్రైవేటు ఆస్పత్రులు వ్యాపారకోణంలో చూడొద్దని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సామాజిక బాధ్యతగా ప్రైవేటు ఆస్పత్రులూ సేవలు అందించాలన్నారు. కరోనా ఫీజు సాధ్యమైనంత తగ్గించి తీసుకోవాలని కోరారు. ప్రజలు మాస్క్‌ ధారణ, భౌతికదూరం పాటించడం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.