లూసీఫర్ రీమేక్‌ను తనే డైరెక్ట్ చేస్తారు: చిరంజీవి
హైదరాబాద్: మలయాళంలో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ `లూసీఫర్`. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ కోసం ఆయన స్క్రిప్టు, దర్శకుడిని ఫైనల్ చేశారు. ఓ వైపు ఆచార్య షూటింగ్ కొనసాగుతుండగానే, లూసిఫర్ రీమేక్ పనులతో బిజీ అయ్యారు. సంక్రాంతి తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. లూసీఫర్ సినిమా స్క్రిప్టు ఫైనల్ అయ్యిందని తెలిపారు. `తనిఒరువన్` (ధృవ) ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారని పేర్కొన్నారు. ‘‘రీమేక్ కథ ఓకే అయ్యింది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్టాత్మక స్క్రిప్టును మోహన్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్‌కు వెళతాం.
ఫిబ్రవరి-మార్చి – ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో నా 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నాతో సినిమా చేయాలని వేచి చూస్తున్న చిరకాల సన్నిహితులు ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సినిమాల పంపిణీదారుడిగా ఆయనతో ఎంతో అనుబంధం ఉంది“ అని తెలిపారు. ఇక దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ-“మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన హిట్లర్ (ముత్యాల సుబ్బయ్య దర్శకుడు) చిత్రానికి తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేసే అదృష్టం దక్కడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. ‘‘ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. ఎన్వీ ప్రసాద్ గారు నిర్మాతగా రాజీ లేకుండా తెరకెక్కించనున్నారు“ అని తెలిపారు.