విజయవాడలో ఇళ్లలోకి వర్షపు నీరు
విజయవాడలో ఇళ్లలోకి వర్షపు నీరు
విజయవాడలో ఇళ్లలోకి వర్షపు నీరు

విజయవాడ: ఏపీలో శుక్రవారం భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యారు. విజయవాడలో వాన నీటితో జలమయమైన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దాంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సైలెన్సర్‌లలోకి నీళ్లు వెళ్లటంతో ఆటోలు, బైక్‌లు మొరాయిస్తున్నాయి. వన్‌టౌన్‌లోని కొన్ని ప్రాంతల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చేసింది. ఈ ప్రాంతంలోని గణపతి రావు రోడ్, గాంధీబొమ్మ సెంటర్, మహాలక్ష్మి టెంపుల్ స్ట్రీట్, నైజం గేట్ సెంటర్ రోడ్లు జలమయం అయ్యాయి. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడతో పాటు కష్ణాజిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

కష్ణానదిలోనూ పెరుగుతున్న వరద
కష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 20,173 క్యూసెక్కుల వరద వస్తోంది. మొత్తం 12 గేట్లను అడుగు మేర ఎత్తి ,700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉపరితల ద్రోణి, ఆవర్తనాలు, అల్పపీడనాల ప్రభావంతో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. కష్ణా, గోదావరి జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి వరద నీటిని విడుదల చేస్తుండటంతో ధవళేశ్వరం వద్ద గోదావరి కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయానికి 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి విడిచిపెట్టగా సాయంత్రానికి 5,7,724 క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తోంది. ప్రవాహం పెరుగుతుండడంతో గోదావరిలో లాంచీలు, బోట్లు, ఇసుకతీత నావల ప్రయాణంపై నిషేధం విధించారు. గోదావరి ఉప నదులు పొంగి ప్రవహించడంతో తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన దేవీపట్నం మండలం కొండమొదలు, నడిపూడి, దేవీపట్నం, కొయ్యేరు తదితర గ్రామాల చుట్టూ వరదనీరు చేరుతోంది. సుమారు 33 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మండల కేంద్రానికి, మైదాన ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో నీటిమట్టం పెరగడం, శబరి కూడా పోటెత్తడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద నీరు చేరింది. ఎద్దువాగు పొంగి పొర్లడం, గోదావరి వరదతో వేలేరుపాడు మండలంలో 16 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
పొంగిపొర్లుతున్న శబరి, సీలేరు
తూర్పుగోదారి జిల్లాలో శబరి, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో లోతట్టు గ్రామాల్లోకి వరద ముంపు పొంచి ఉంది. దేవీపట్నం మండలంలోని 30గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పి.గన్నవరం మండలం చాకలిపాలెం- కనకాయలంక కాజ్ వేపైకి వరద ప్రవహిస్తోంది. తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
గోదావరి ఉరకలు పరుగులు పెడుతుంది.. గడచిన మూడు రోజులుగా వరద నీరు క్రమేపీ పెరుగుతుంది. ఒక వైపు మారిన వాతావరణం, వరుసగా అల్పపీడన ద్రోణులు, వాయుగుండం కూడా జతకలియడంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉండడంతో గోదావరిలో వరద ఒక్కసారిగా ముంచు కొచ్చింది.
ఏపీలో శనివారం మోస్తరు వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం రెండు రోజుల్లో మరింతగా బలపడనుందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఏపీలో శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.