విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన సోనూసూద్
మన రియల్ హీరో కరోనా మొదలైన నాటి నుండి ఏదో ఒక విధంగా ప్రజలను ఆదుకుంటునే ఉన్నారు. రాష్ట్రం, ప్రాంతం, భాష బేధాలు లేకుండా సహాయం కావాలని మెస్సేజ్ చేయడమే ఆలస్యం ఏదో ఒక రకంగా తనకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి మన హీరో సోనూసూద్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. బడి పిల్లలకు ఆన్లైన్ తరగతులు తప్పనిసరైన ప్రస్తుత ఈ నేపథ్యంలో.. ఏజెన్సి ప్రాంతాల్లోని పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేని పరిస్థితి మనందరికీ తెలిసిందే.. కేవలం ఫోన్లు లేని కారణంగా ఆన్ లైన్ తరగతుల కోసం కొన్నిమైళ్ల దూరం ప్రయాణిస్తున్న హర్యానాలోని ఏజెన్సీ ప్రాంతం మోర్ని వాసుల పిల్లలకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ అండగా నిలిచారు. మోర్నిలో కోటి గ్రామంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులకు సోనూసూద్ తన స్నేహితుడి కరణ్ గిల్హోత్రా ద్వారా స్మార్ట్ ఫోన్లు అందించాడు. ఆ ఫోన్లతోనే వీడియో కాల్ ద్వారా విద్యార్థులు సోనూసూద్ తో మాట్లాడటం విశేషం. నా రోజు చాలా బాగా మొదలైంది. స్మార్ట్ ఫోన్లు అందుకుని పిల్లలు ఆన్ లైన్ తరగతులకు హాజరవుతున్నారు. అని సోనూసూద్ ట్వీట్ చేశాడు.