విద్యార్థుల భవిత‌కే ముప్పు: విద్యావేత్తలు

న్యూఢిల్లీ : జెఇఇ, నీట్‌ పరీక్షలపై భారత్‌, విదేశాలలోని వివిధ యూనివర్శిటీల నుండి 150 మందికి పైగా విద్యావేత్తలు ప్రధాని మోడీకి లేఖ రాశాయి. ఈ‌ పరీక్షల నిర్వహణపై కొనసాగుతున్న రాద్దాంతం తెలిసిందే. కరోనా క‌రాళ‌నృత్యం చేస్తున్న‌వేళా ప‌రీక్ష‌లా అని ప‌లువురు కేంద్ర స‌ర్కార్‌పై విమ‌ర్వ‌లు చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడవద్దని విపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా పరీక్షల నిర్వహణ చేపట్టాలంటూ వివిద కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా ప్రమాదం ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని లేఖలో కోరారు. ఇంట‌ర్ పాసైన‌ లక్షలాది విద్యార్థులు ఎదురుచూస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ వారి కలలను చిదిమేయకూడదని లేఖలో పేర్కొన్నారు. కొంద‌రు నేత‌లు త‌మ రాజ‌కీయ లాభంకోసం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని లేఖలో తెలిపారు.
విదేశాలు, మెడికల్‌, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలైన జెఇఇ, నీట్‌ పరీక్షల నిర్వహణను మరింత ఆలస్యం చేస్తే విద్యార్థులు భవిష్యత్తులో రాజీపడాల్సి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని పలువరు రాజకీయ నేతలు, విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వారు స్పందిస్తూ.. కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు దేశాభివృద్ధికి కీలకమని, కొవిడ్‌ పేరుతో వారి భవిష్యత్‌పై అనిశ్చితి మేఘాలు కమ్ముకున్నాయని అన్నారు. అడ్మిషన్‌, తరగతుల నిర్వహణపై భయాలు ఉన్నాయని, వీటిని త్వరగా పరిష్కరించాల్సి ఉందని అన్నారు. ఉన్నత విద్య గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. పరీక్షల షెడ్యూల్‌ ఇంకా ఆలస్యం చేస్తే .. విద్యార్థులకు ఏడాది కాలం వృథా అవుతుందని అన్నారు. ఈ లేఖలో సంతకం చేసిన వారిలో ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇగ్నో, లక్నో విశ్వవిద్యాలయం, జేఎన్‌యూ, బీహెచ్‌యూ, ఐఐటీ ఢిల్లీకి చెందిన విద్యావేత్తలతో పాటు లండన్‌ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, హిబ్రూ విశ్వవిద్యాలయం, జెరూసలేం విశ్వవిద్యాలయం, ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న భారతీయ విద్యావేత్తలు కూడా ఉన్నారు. పరీక్షల నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. తమపై తీవ్ర ఒత్తిడి ఉన్నదని, త‌ల్లిదండ్రులు, విద్యార్థుల కోరిక మేరకు జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ వెల్లడించారు.
సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలను నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల పెంపుతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను 570 నుంచి 660కి, నీట్ కేంద్రాలను 2546 నుంచి 3843కి పెంచారు. షిఫ్ట్‌ల సంఖ్యను కూడా 8 నుంచి 12 పెంచి.. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే వారి సంఖ్యను 1.32 లక్షల నుంచి 85వేలకు తగ్గించారు. కాగా, దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు 8.58 లక్షల మంది విద్యార్థులు, నీట్‌కు 15.97 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.

1 Comment
  1. […] విద్యార్థుల భవిత‌కే ముప్పు: విద్యావే… […]

Leave A Reply

Your email address will not be published.