విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: సోనియా గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో జాతి విద్రోహశక్తులు విషం చిమ్ముతున్నాయని, హింసను ప్రజ్వలింప చేస్తున్నాయని కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రజాస్వామ్యంపై నియంతృత్వ ప్రభావం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులు, జాతిపితలు ఈ 75 ఏళ్లలో దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడతాయని ఎన్నడూ ఊహించి ఉండరని పేర్కొన్నారు. దుష్ట ఆలోచనలే ఇప్పడు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ముప్పు ఎదుర్కొంటోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనం అవుతున్నాయని తెలిపారు. గత కొంతకాలంగా దేశాన్ని గాడి తప్పించే చర్యలు చోటుచేసుకుంటున్నాయని, ప్రజాస్వామ్యం ముందు కొత్త సవాళ్లు నిలిచాయని వ్యాఖ్యానించారు. దేశం ఇవాళ దిక్కుతోచని స్థితిలో నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘విష, విద్వేష సంస్కృతిని ప్రోత్సహిస్తున్న శక్తులు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. భావ ప్రకటనా స్వేచ్చను అణచివేస్తున్నాయి. భారత ప్రజలు, మన గిరిజనులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాలు నోరెత్తకుండా ఉండాలని కోరుకుంటున్నాయి. వాళ్లు జాతి మొత్తం మౌనంగా ఉండాలని కోరుకుంటున్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్ ఇలాంటి మహా నేతలు ఎవరూ దేశం ఇలా మారిపోతుందని ఎన్నడూ ఊహించి ఉండరు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. నియంతృత్వ పోకడలు పెచ్చుమీరుతున్నాయి. ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు’’ అని సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆమె.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. చత్తీస్‌గఢ్‌లోని న్యూ రాయపూర్‌లో కొత్త అసెంబ్లీ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి సోనియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగానే సోనియా వ్యాఖ్యలు చేశారు.