విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు: కెటిఆర్

హైదరాబాద్ : ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతామన్నారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కరస్పాండెన్స్, టీచర్ల సమావేశం నగరంలోని జలవిహార్లో బుధవారం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న విశాఖ స్టీల్ కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటుపరం చేస్తోందన్నారు. విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతితో వైజాగ్ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటామన్నారు. తెలంగాణ సమస్యలపై కూడా వారు తమకి మద్దతు ఇవ్వాలన్నారు. ఇలానే ఉంటే ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటుపరం చేస్తారని పేర్కొన్నారు.
ఎక్కడో విశాఖలో ఉద్యమం మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు వస్తారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతారు. రేపు బిపిఎల్ అమ్ముతారు. ఎల్లుండి సింగరేణి అమ్ముతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయివేటు పరం చేయడండి అంటారు. ఎమైనా చేస్తారు. ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇస్తాం.. తెలంగాణలో ప్రభుత్వ సంస్థలు అమ్మే ప్రయత్నం చేస్తే వారు కూడా మాతో కలిసి రావాలి అని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు.
[…] […]