వ్యవసాయ బిల్లులు పాస్
విపక్షాల ఆందోళన మధ్య బిల్లులకు ఆమోదం
న్యూఢిల్లీ : వ‌్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన బిల్లులు తాజాగా రాజ్యసభ ఆమోదం కూడా పొందాయి. ఆదివారం విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య రెండు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లులకు పెద్దల సభ ఆమోదం తెలిపింది. రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ బిల్లులపై చర్చ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలను విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎమపీలు నినాదాలు చేశారు. బిల్లు ప్రతులను పలువురు సభ్యులు చించివేశారు.
వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులను సభ ఆమోదం తెలిపిందని ప్రకటించిన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇక అంతకుముందు రాజ్యసభలో బిల్లు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ బిల్లులకు బీజేపీ, బీజేడీ, వైసీపీ, టీడీపీ, అన్నాడీఎంకే మద్దతివ్వగా.. కాంగ్రెస్, తృణమూల్, టీఆర్‌ఎస్, డీఎంకే, శివసేన, ఆర్జేడీ, అకాలీదళ్, ఎస్పీ, ఆప్, బీఎస్పీలు వ్యతిరేకించాయి. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు.
టీఎంసీ, ఆమ్‌ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకులు విరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోళానికి దారితీసింది. కాగా లోక్‌సభలో వ్యవసాయ బిల్లులు గురువారం రాత్రి ఆమోదం పొందాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు నిరసనగా పంజాబ్, హరియాణ సహా పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు. ఇదివరకే ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. కాగా.. ఆదివారం నాడు రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు ఎంతో చారిత్రాత్మకమైనవని, రైతుల జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాయని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రైతుల గొంతుకోసేలా కేంద్రం వ్యవసాయ బిల్లులు ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ప్రతిపక్షాల విమర్శలు.. మరోవైపు దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన విషయం విదితమే.
బిల్లును వ్యతిరేకిందిచిన టీఆర్ఎస్పా..
ఈ బిల్లులను ఏపీలో అధికారంలో ఉండే వైసీపీ ఎంపీలు మద్దతివ్వగా.. టీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడుతూ ఈ బిల్లులను వ్యతిరేకించి మద్దతివ్వలేదు. కేంద్రం ప్రవేశపెట్టే ఈ వ్యవసాయ బిల్లు వ్యవసాయ రంగంలోనూ కార్పొరేట్లను పెంచి పోషించేలా ఉందని టిఆర్ ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కేశవరావు మాట్లాడారు. కొత్త వ్యవసాయ బిల్లుతో రైతులను తీరని నష్టం జరిగే అవకాశముందని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం బిల్లును రూపొందించిందని ఆక్షేపించారు. రైతులకు అండగా లేని ఇలాంటి చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మార్కెటింగ్ ఏజెంట్లకు సైతం నష్టం కలిగించేలా ఈ కొత్త చట్టం ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఏ పథకానికి సక్రమంగా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు.
వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతు
వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆదివారం సభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఈ బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి, దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని పేర్కొన్నారు. పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. దళారీల ఆగడాల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. ‘‘మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుంది. బిల్లులో పొగాకును ఎందుకు చేర్చడం లేదు. రైతు ప్రయోజనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుంది. రైతు భరోసా పేరుతో 49 లక్షల మంది రైతులకు ఏటా 13,500 ఇస్తోంది. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని సీఎం జగన్ ఏర్పాటు చేశారు.’’ ఆయన వివరించారు. కాగా ఈ సందర్భంగా సభలో కాంగ్రెస్ పార్టీ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మార్కెట్ కమిటీలు రద్దు చేసి, పంటల రవాణాపై ఆంక్షలను తొలగిస్తామని చెప్పిందని.. ఆ అంశాలనే ఎన్డీయే బిల్లుగా తెచ్చిందన్నారు. ఆత్మవంచన మానుకోవాలని కాంగ్రెస్‌కు విజయసాయిరెడ్డి హితవు పలికారు.
బిల్లులు చారిత్రాత్మకంః తోమర్
అంతకు ముందు కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశ పెడుతూ.. రైతు వ్యవసాయ సంబంధ బిల్లులు చరిత్రాత్మకమైనవని పేర్కొన్నారు. రైతుల జీవన ప్రమాణాలు మరింత మెరుగు పడేందుకు ఈ బిల్లులు మరింతగా దోహదపడతాయని చెప్పారు.