శాస్త్ర‌వేత్త‌లారా దేశం గ‌ర్విస్తున్న‌ది: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: ప్ర‌పంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్య‌క్ర‌మం భార‌త్‌లో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న‌ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేర్కొన్నారు. జాతీయ తూనిక‌లు, కొల‌త‌ల శాఖ స‌మావేశంలో వీడియో కాన్ఫ‌రెన్స్ లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దేశంలోని శాస్త్ర‌వేత్త‌ల‌ను అభినందించారు. స్వ‌దేశంలో కొవిడ్‌ టీకాల‌ను అభివృద్ధి చేయడంలో మ‌న శాస్త్ర‌వేత్త‌లు విజ‌య‌వంత‌మ‌య్యార‌ని కొనియాడారు. రెండు స్వ‌దేశీ వ్యాక్సిన్‌ల‌ను అందుబాటులోకి తెచ్చిన శాస్త్ర‌వేత్త‌ల‌ను చూసి దేశం గ‌ర్విస్తోంద‌న్నారు.

క‌రోనా వ్యాక్సిన్ ఉత్ప‌త్తి నేప‌థ్యంలో మేకిన్ ఇండియా గురించి మాట్లాడిన ప్ర‌ధాని.. మ‌నం త‌యారుచేసే ఉత్ప‌త్తుల‌కు ప‌రిమాణం ఎంత ముఖ్య‌మో, నాణ్య‌త కూడా అంతే ముఖ్య‌మ‌న్నారు. నాణ్య‌త‌, విశ్వ‌స‌నీయ‌త‌గ‌ల ఉత్ప‌త్తుల‌ను తీసుకొస్తూ మ‌న బ్రాండ్ ఇండియాను మ‌రింత బ‌లోపేతం చేయాల‌న్నారు. మేకిన్ ఇండియా ఉత్ప‌త్తుల‌కు డిమాండ్‌తోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆమోదం ల‌భించేలా కృషి చేయాల‌న్నారు.

గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ ర్యాంకింగ్స్‌లో భార‌త్ టాప్ 50 దేశాల్లో ఒక‌టిగా నిలిచింద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌, సంస్థ‌ల మ‌ధ్య స‌హ‌కారం మ‌రింత బ‌ల‌ప‌డుత‌న్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. అందుకే స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌ధాని నేష‌న‌ల్ అటామిక్ స్కేల్‌, నిర్దేశ‌క్ ద్ర‌వ్య‌ల‌ను ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.