శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో పేలుళ్లు

నాగర్ కర్నూల్: శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటలకు పేలుళ్లు సంభవించాయి. నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం పాతాళగంగలో ఉన్న తెలంగాణకు చెందిన ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 4వ యూనిట్‌ టర్మినల్‌ వద్ద కార్మికులు విద్యుదుత్పత్తి పనిలో నిమగ్నమై ఉండగా.. అకస్మాత్తుగా షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ప్యానల్‌ బోర్డుల్లో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు టన్నెళ్లకు వ్యాపించి పేలుళ్లు సంభవించాయి. భారీ శబ్దాలు వెలువడ్డాయి. రెండు కిలోమీటర్ల సొరంగంలో జీరో లెవల్‌ నుంచి సర్వీస్‌ బే వరకు దట్టమైన పొగ కమ్ముకు పోయింది. పొగలు రావడాన్ని గమనించి డిఇ పవన్‌కుమార్‌తో పాటు ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సిబ్బంది కొందరు వెంటనే బయటకు పరుగులు తీశారు. చూస్తూ ఉండగానే కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది. షార్ట్‌ సర్కూట్‌ వల్ల ప్యానల్‌ బోర్డులలో ఏర్పడిన మంటలకు భారీగా పేలుడు శబ్దాలు వచ్చాయి. ప్రమాద సమయంలో విధుల్లో సుమారు 20 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎఇలు , 6 మంది సిబ్బంది మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని పోలీసులు, రక్షణ సిబ్బంది తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. లోపలున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి జగదీష్‌ రెడ్డి, సిఎండి ప్రభాకర్‌ రావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్‌ శర్మన్‌ చేరుకున్నారు. అక్కడే చిక్కుకుపోయిన సిబ్బందిని కాపాడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నామన్నారు.
ప్రమాదంతో దట్టమైన మంటలు, పొగ అలముకోవడంతో 9 మంది సిబ్బంది బయటికి రాలేక పవర్‌ హౌస్లో చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
1) శ్రీనివాస్‌ (డిఇ)
2) వెంకట్రావు (ఎఇ)
3) ఫాతిమా బేగం (ఎఇ)
4) మోహన్‌ (ఎఇ)
5) సుందర్‌ (ఎఇ)
6) రాంబాబు (పిఎ)
7) కిరణ్‌ (ఎఇ)
8) ఇద్దరు ప్రవేట్‌ వ్యక్తులు హైదరాబాద్‌ కుచెందిన బ్యాటరీ రిపేరర్లు.

ప్రమాదం దురదృష్టకరం: మంత్రి జగదీష్‌రెడ్డి
శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌హౌస్‌లో ప్రమాదం దురదృష్టకరమని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. మొదటి యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగిందన్నారు. అగ్నిప్రమాదంలో నాలుగు ప్యానెల్స్‌ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 10 మంది సురక్షితంగా బయటకొచ్చారు.. మరో 9 మంది చిక్కుకున్నారని వెల్లడించారు. ‘‘లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఫైర్‌, పోలీస్‌ సిబ్బంది లోపలికి వెళ్లారు. దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోపలికి వెళ్లి వెనక్కి వచ్చారు. ఆక్సిజన్‌ పెట్టుకుని వెళ్లినా లోపలికి వెళ్లలేకపోతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి సిబ్బంది సహాయం కోరాం. లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని’’ మంత్రి వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.