సచిన్‌తో కరచాలనం చేశాక స్నానం చేయాలనుకోలేదు: యువరాజ్ సింగ్

న్యూఢిల్లీ : అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం నాటి రోజులను టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. అప్పటికే భారతజట్టుకు ఆడుతున్న ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు సచిన్‌ను తొలిసారి కలిసిన ఆనంద క్షణాలను నెమరువేసుకున్నాడు. 2000వ సంవత్సరంలో యువరాజ్ సింగ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. టీం బస్సులో తొలిసారి సచిన్‌‌‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత తాను స్నానం చేయాలనుకోలేదని యువీ పేర్కొన్నాడు.  అప్పటికే సచిన్‌ క్రికెట్‌ రారాజుగా అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ ఏడాది అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో అద్భుతంగా ఆడిన యువరాజ్‌ సింగ్‌ టీమిండియాకు ఎంపికయ్యాడు. అతనితో పాటు జహీర్‌ ఖాన్‌కు కూడా భారత జట్టులో అవకాశం లభించింది. అయితే తన చిన్ననాటి హీరో, ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ టీమ్‌ బస్సులో తొలిసారి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డానని యువీ గుర్తు చేసుకున్నాడు.

యువరాజ్‌ సింగ్‌
‘సచిన్‌ తొలిసారి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చిన తర్వాత స్నానం చేయాలనుకోలేదు. తన చేతులతో శరీరం మొత్తం తడుముకున్నా’ అని చెప్పాడు. అండర్‌-19 తర్వాత సీనియర్‌ జట్టులోకి అడుగుపెట్టిన తాను.. సచిన్‌, గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, శ్రీనాథ్‌ లాంటి గొప్ప ఆటగాళ్లను చూసి తానెక్కడ ఉన్నానని ఆశ్చర్యపోయానన్నాడు. ఓ సందర్భంలో ‘సచిన్‌ పక్క సీటు మాత్రమే ఖాళీగా ఉండటంతో అక్కడ తాను కూర్చోనని టీమ్‌ మేనేజర్‌కు చెప్పాను. తను ఇప్పుడు నీ టీమ్‌ మేట్‌. కాబట్టి నువ్వు మాట్లాడాల్సి ఉంటుందని మేనేజర్‌ చెప్పాడు. మెల్లగా వెళ్లి సచిన్‌ను అలాగే చూస్తూ.. వావ్‌ సచిన్‌ అనుకున్నానని’అని యువీ తెలిపాడు. ‘నా కిట్‌ బ్యాగ్‌ తెరవగానే అందులో సచిన్‌ ఫొటో ఉంది. సచిన్‌ ఆ ఫొటోను చూసి.. ఫొటో బాగుంది. ఎవరా బ్యాట్స్‌మెన్‌ అని అడిగి నవ్వేశాడు. మా మధ్య చనువు పెరగడానికే సచిన్‌ అలా చేశాడు.’ అని యువీ నెమరువేసుకున్నాడు. 2011 వరల్డ్‌ కప్‌ భారత్‌ గెలవగా.. సచిన్‌ కెరీర్లో ఇదే ఏకైక వరల్డ్‌ కప్‌ అనే సంగతి తెలిసింది. వరల్డ్‌ కప్‌లో 362 రన్స్‌ చేసిన యువీ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు.

సచిన్ టెండూల్కర్‌ను బాస్కెట్‌బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్‌‌తో యువరాజ్ పోల్చాడు. సచిన్ భారత క్రికెట్‌లో మైఖేల్ జోర్డాన్ అని అభివర్ణించాడు. సచిన్‌ కొన్ని సంవత్సరాల పాటు భారత అభిమానుల ఆశలను మోశాడని ప్రశంసించాడు. అతడి ప్రవర్తనను తాను ఏళ్లతరబడి చూశానని, మైదానం బయట సచిన్ ఎలా ఉంటాడన్నది తనకు తెలుసని పేర్కొన్న యువరాజ్.. కాబట్టి జీవితం గురించి మాట్లాడగలిగే సంబంధం ఉందని చెప్పుకొచ్చాడు.

Leave A Reply

Your email address will not be published.