సముద్రానికి అమావాస్య పోటు..

వైజాగ్: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి వెల్లడించారు. దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఒక ఉపరితల ఆవర్తనం, దీని మీదుగా 1.5 కిలో మీటర్ల నుంచి 2.1 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ నెల 19న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఇది 20వ తేదీ నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాగల 48 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
అంతర్వేది పల్లి పాలెం వైపు చొచ్చుకొస్తున్న గోదారి..
సఖినేటిపల్లి: అమావాస్యతో సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో పల్లెపాలెం గ్రామం వణుకుతుంది. గ్రామంలోని ‘నిధి’ అనే ప్రాంతాన్ని ఒకవైపు సముద్రపు నీరు మరోవైపు గోదావరి వరద నీరు ముంచెత్తడంతో సుమారు 60 కుటుంబాలు నిరాశ్రయులు అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో చిట్టచివరి మండలమైన సఖినేటిపల్లి మండలం తీరప్రాంత గ్రామమైన అంతర్వేది పల్లెపాలెం అటు సముద్రానికి ఇటు గోదావరికి చేరువులో ఉంటుంది. అమావాస్యపోటుతో సముద్రం, అధిక వర్షాల కారణంగా గోదావరి, ముందుకు వచ్చాయి. గురువారం రాత్రి నుండి ఒకవైపు నుండి సముద్రపు నీరు, మరొక ప్రాంతం నుండి గోదావరి మీరు ముంచెత్తడంతో పండెలా, మెరక ,నిధి, అని మూడు ప్రాంతాలుగా ఉన్న పల్లెపాలెంలోని నిధి ప్రాంతం ముంపుకు గురయ్యింది. సుమారు 60 కుటుంబాలకు చెందిన వారు నిరాశ్రయులయ్యారు.
ఈ ముప్పు వల్ల అరవై కుటుంబాలు చెందిన ఇళ్లు దెబ్బతిన్నాయి. నిలువ నీడ లేక అల్లాడిపోతున్న వారని అధికారులు స్పందించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టేకిశెట్టి పాలెం వీఆర్వో పోతురాజు వెంకట నరసింహ కుమార్ (బాబులు) తక్షణం స్పందించి పరిస్థితిని అధికారులు తెలియజేశారు. ఈ ప్రాంతాలను శుక్రవారం రాజోలు ఎమ్మెల్యే రాపాక. వరప్రసాద్ స్వయంగా పరిశీలించారు. పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని అధికారులు ఆదేశించారు. అమావాస్య, పౌర్ణమి తిథులలో సముద్రపు కెరటాల తీవ్రత ఎక్కువగా ఉండటం, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటితో లోతట్టు ప్రాంతాల్లోని ఇల్లు మునిగిపోయాయనీ అధికారులు తెలియజేశారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం సుమారు రెండు కోట్ల రూపాయలతో గోదావరి తీరం వెంట రిటైర్మెంట్ కట్టాలని, ఈ విషయాన్ని తనే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి తెలియ చేస్తానని ఎమ్మెల్యే రాపాక బాధితులకు హామీ ఇచ్చారు.