సాగర ప్రవేశం చేసిన ఖైరతాబాద్ గణనాధుడు

హైదరాబాద్: కరోనా వైరస్ నూపథ్యంలో హైదరాబాద్లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కళ తప్పింది. హైదరాబాద్‌లో డిజె సౌండ్లు, డప్పుల దరువు, యువత నృత్యాలు, చిన్నారుల కేరింతలు, కళాజాతాలు.. లేకుండానే గణేష్ నిమజ్జనం నిరాడంబరంగా సాగింది. అపార్టుమెంట్లు, గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపాలకు మాత్రమే పోలీసులు షరతులతో కూడిన అనుమతులివ్వడంతో ట్యాంకుబండ్‌పై కోలాహలం కనిపించలేదు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో నిమజ్జనానికి ప్రభుత్వం 21 క్రేన్లను ఏర్పాటుచేసింది. ఈసారి నగరవాసులు భారీ గణనాధులను ప్రతిష్టించలేదు. నిమజ్జనం సందర్భంగా ట్యాంకుబండ్‌తో పాటు శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి కంట్రోలింగ్ యూనిట్ నుంచి నిత్యం పరిస్థితిని సమీక్షించారు. పెద్దగా భక్తులు గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు కూడా పోలీసులకు సంపూర్ణ సహకారం అందించారు.
మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయానికి నిమజ్జనం పూర్తవుతుందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. గణేష్ ఉత్సవాలంటే గుర్తుకు వచ్చే ఖైరతాబాద్, బాలాపూర్ గణపయ్యల శోభాయాత్ర సాదాసీదాగా జరిగింది. మధ్యాహ్నం సమయానికే ఖైరతాబాద్ గణేషుడు గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు. ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు కేవలం 9 అడుగుల మట్టి విగ్రహంగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఒక్కరోజే మూడు వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చాయి. బుధవారం ఉదయం 9 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. కాగా ఈసారి బాలాపూర్‌లో వేలం పాట లేకుండానే గణేష్ శోభయాత్ర ప్రారంభమైంది.