సిద్దిపేట అత్యంత క్రియాశీల‌క ప్రాంతం: కెసిఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ సిద్దిపేట జిల్లా ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. గురువారం ఉద‌యం కొండ‌పాక మండ‌లం దుద్దెడ చేరుకున్న సిఎం.. ఐటి పార్కుకు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐటి శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్‌, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు శుభాభినందనలు తెలిపారు. ఐటీ రంగంలో సిద్దిపేట పురోగతి సాధిస్తుందన్నారు. రాష్ట్ర రాజధానికి సిద్దిపేట అత్యంత సమీపంలో ఉందన్నారు. సిద్దిపేట అత్యంత క్రియాశీలక ప్రాంతమని, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. భవిష్యత్‌లో జిల్లా పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుందని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ సమక్షంలో పలు కంపెనీలతో ఒప్పందాలపై ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సంతకాలు చేశారు. ఇందులో జోలాన్ టెక్నాలజీ, విసాన్ టెక్, ఎంబ్రోడ్స్ టెక్నాలజీ, సెట్విన్ వంటి కంపెనీలు ఉన్నాయి. దుద్దెడలో ఐటీ పార్కును మూడెకరాల విస్తీర్ణంలో రూ. 45 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో 2 వేల మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.