సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్!

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. దాదాపు ఆరు నెలలుగా మూతబడిన సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకోబోతున్నాయి. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌కు కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 30తో నాలుగో దశ అన్‌లాక్ ముగుస్తున్న నేపథ్యంలో మరికొన్ని సడలింపులతో కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకునే వెసులుబాటు కల్పించింది. అయితే 50 శాతం సీట్లు సామర్థ్యంతో మాత్రమే థియేటర్లను నడపాలని సూచించింది. అలాగే 15 నుంచి కొవిడ్‌నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్లు, ఎంటర్ టైన్‌మెంటు పార్కులు తెరుచుకోనున్నాయి. క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్‌ఫూల్స్ తెరిచే వెసులుబాటు కల్పించింది. కంటైన్‌మెంటు జోన్లలో మాత్రం అక్టోబరు 31 వరకు లాక్‌డౌన్ యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
(తప్పక చదవండిః 1 నుంచి అన్ లాక్ 5.0..! సడలింపులు ఇవే?)
తాజాగా మార్గదర్శకాలను అనుసరించి వచ్చే నెల 15 వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరిచే అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొంది. అక్టోబరు 15 నుంచి స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు దశలవారీగా తెరిచేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడిచిపెట్టింది. ఆన్‌లైన్ క్లాసులు కొనసాగించుకోవచ్చంది. అయితే విద్యార్థులను పాఠశాలలకు రమ్మని అడగడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సామాజిక / విద్యా / క్రీడలు / వినోదం / సాంస్కృతిక / మత / రాజకీయ విధులు, ఇతర సమ్మేళనాలకు ఇప్పటికే 100 మంది వ్యక్తులకు అనుమతిస్తున్నారు. అలాగే కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని ఉన్నత విద్యావిభాగాలకు విడిచిపెట్టింది. ఆన్‌లైన్ తరగతులకు ప్రాధాన్యతను ఇవ్వాలని పేర్కొంది.