సీఎం సహాయనిధికి పవన్‌కల్యాణ్ రూ.కోటి విరాళం

హైదరాబాద్ః ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. నగరంలోని పలు కాలనీలు వరద ముంపు గురయ్యాయి. పలురు ముంపు బాధితులు సర్వస్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తక్షణ సాయంగా భారీగా విడుదల చేసింది. బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా పిలుపునిచ్చారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు సంస్థలు, ప్రముఖులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు పలువురు ముందుకు వస్తున్నారు. తాజాగా హీరో, రాజకీయ నాయకుడు, జనసేనాని పవన్‌కల్యాణ్ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సిఎం పిలుపు మేరకు టాలీవుడ్ ఇండస్ట్రీనుండి పలువురు స్పందించారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, సూపర్‌స్టార్ మహేష్ బాబు కోటి రూపాయలు, ప్రభాస్ రూ.కోటిన్నర ప్రకటించారు. అలాగే యువసామ్రాట్ అక్కినేని నాగార్జున రూ. 50 లక్షలు, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, యువ నటుడు విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, దర్శకులు హరీష్ శంకర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. మరికొంత మంది సినీ ప్రముఖులు సైతం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 15 కోట్ల రూపాయల సాయం ప్రకటించి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇప్పటికే తమిళనాడు తరఫున ఆ రాష్ట్ర సీఎం కె.పళనిస్వామి రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.