సెలూన్లకు ఉచిత విద్యుత్‌

ఈ నెల 1వ తేదీ నుంచే అమలు.. అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని రజక, నాయీ బ్రహ్మణులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ రెండు వర్గాల కార్మికులు చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్న ఉచిత కరెంట్‌ సరఫరాను ప్రభుత్వం అంగీకరించింది. బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు. రాష్ట్రంలోని సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ మేరకు తక్షణమే జీవో జారీ చేయాలని సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు జీవో విడుదల చేశారు. ఉచిత విద్యుత్‌ సరఫరా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ద్వారా లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు కేసీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలుచేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. రజక, నాయీబ్రాహ్మణ సంఘాలు ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రం మొత్తానికి ఈ నిర్ణయం వర్తింపజేయాలని ఆదేశించారు. అత్యంత బలహీనవర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, వారికోసం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని సీఎం తెలిపారు.

ఈ నెల 1వ తేదీ నుంచి సెలూన్లకు కరెంట్‌ ఫ్రీ

సాంకేతికాభివృద్ధి కారణంగా రజకులు, నాయీబ్రాహ్మణులు కులవృత్తి నిర్వహణలో పలురకాల యంత్రాలు వాడుతున్నారు. ఇకనుంచి ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందిస్తుండటంతో వీరికి శారీరక శ్రమ తగ్గి, ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. సీఎం ఆదేశాలమేరకు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదివారం జీవో విడుదలచేశారు. ఈ నెల 1వ తేదీనుంచే ఉచిత విద్యుత్‌ సరఫరా అమల్లోకి వస్తుందని జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామస్థాయి నుంచి జీహెచ్‌ఎంసీ వరకు కులవృత్తిలో ఉన్న నాలుగున్నర లక్షలమంది రజకులకు, రెండున్నర లక్షలమంది నాయీబ్రాహ్మణులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ నెల నుంచి రాష్ట్రంలో నెలకు 250 యూనిట్లవరకు విద్యుత్తు వాడే క్షవరశాలలు, లాండ్రీలు, దోబీఘాట్ల యజమానులు బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందనున్నారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్ నిర్ణయంపై రజకులు, నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

1 Comment
  1. […] సెలూన్లకు ఉచిత విద్యుత్‌ […]

Leave A Reply

Your email address will not be published.