సైనికులకు అండగా దేశం : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, దేశంలో కరోనా వైరస్ విజృంభణపై ప్రధాని మోడీ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్ దేశం సైనికుల వెంట నిలిచి ఉందన్న సంకేతాన్ని పార్లమెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ వర్షాకాలా సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా భిన్నమైన సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని, ఒకవైపు కరోనా, మరో వైపు విధి నిర్వహణ ఉందని, కానీ ఎంపీలంతా తమ డ్యూటీకే ప్రాధాన్యత ఇచ్చారని, ఎంపీలందరికీ తాను కంగ్రాట్స్ చెబుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాజ్యసభ, లోక్‌సభలు రెండు వేరువేరు సమయాల్లో జరుగుతాయని, శని-ఆదివారాల్లోనూ సమావేశాలు ఉంటాయని, దీనికి ఎంపీలందరూ ఆమోదం తెలిపినట్లు మోదీ చెప్పారు. ఇక చైనాతో నెలకొన్న సరిహద్దు అంశాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. యావత్ దేశం మొత్తం సైనికుల వెంటే ఉందన్న సంకేతాన్ని పార్లమెంట్ సభ్యులు వినిపిస్తారని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
సోమవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ
`మన సైనికులు మాతృభూమిని రక్షించుకోవడం కోసం, క్షిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా సరిహద్దుల్లో ధైర్యంగా నిలబడి ఉన్నారు. అదే విధంగా వారికి మనం అండగా నిలబడి ఉన్నామని పార్లమెంట్ కూడా సందేశాన్ని పంపుతుందని విశ్వసిస్తున్నాను“ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. జూన్ నెలలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే ఆ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న సమావేశాల్లో కేంద్రం పార్లమెంటులో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కరోనా వైరస్‌కు మందు రానంత వరకు నిర్లక్ష్యం వద్దు అంటూ మోదీ మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. కరోనా వైరస్‌కు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వస్తే బాగుంటుందన్నారు. మన శాస్త్రవేత్తలు కూడా వ్యాక్సిన్ తయారీలో సక్సెస్ సాధించినట్లు మోదీ తెలిపారు.
భారత వీవీఐపీలపై చైనా నిఘా..
రెండు దేశాల మధ్య నెల కొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ప్రధాని, సైనికాధికారులు, ఇతర వీవీఐపీలపై చైనా గూఢచర్యానికి పాల్పడిందంటూ ఓ జాతీయ ఛానెల్ బయటపెట్టిన నేపథ్యంలో కేంద్రం తాజాగా స్పందించింది. ‘ఇందులో ఆశ్చర్యమేమీ లేదు’ అని సోమవారం నాడు వ్యాఖ్యానించింది. భారత నిఘా సంస్థలకు ఈ విషయంపై ముందుగానే సమాచారం ఉందని పేర్కొంది. ‘ఇటువంటి కారణాల రీత్యానేన చైనా యాప్‌లను నిషేధించాలనే నిర్ణయానికి వచ్చాము’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు వ్యాఖ్యానించారు. ప్రధాని వంటి వీఐపీలకు సంబంధించి బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని సైతం భారత వ్యతిరేక కార్యకలాపాలకు శత్రు దేశాలు వినియోగించవచ్చని తెలిపారు.
కాగా.. చైనాతో ఉద్రిక్తతల నెలకొన్న పరిస్థితుల్లో ఈ ఘటనకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఇలా బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా శుత్రుదేశ నిఘా సంస్థలు తమకు కావాల్సిన వివరాల్లో 80 శాతం దాకా రాబట్టగలవని అధికారులు చెప్పారు. అదే సమయంలో.. ఈ వ్యవహారశైలి ప్రపంచ దేశాలకు మూమూలేనని కూడా వారు వ్యాఖ్యానించారు. ప్రతి దేశం.. ఇలాంటి సమాచారా విశ్లేషణ ద్వారానే ఇతర దేశాలపై ఓ కన్నేసి ఉంచుతుందన్నారు. అమెరికా అయితే సోషల్ మీడియా ద్వారా ఏకంగా 200 రకాల డాటా వివరాలను సేకరిస్తూ ఇతర దేశాలపై గట్టి నిఘా పెడుతుందన్నారు. కాగా సరిహద్దులో రోజురోజుకు చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి మరి.