స‌ర్కార్ ముందు 14 డిమాండ్లు!

పాఠ‌శాల‌ల పునఃప్రారంభంపై మంత్రి సబిత స‌మీక్ష‌

హైదరాబాద్‌ : తెలంగాణ‌ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యా సంవత్సరాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.వివిధ త‌ర‌గ‌తుల్లో సిల‌బ‌స్ త‌గ్గింపుపై త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. త‌ర‌గ‌తులు ప్రారంభించేందుకు ప్రైవేటు విద్యా సంస్థ‌లు సిద్ధం కావాల‌ని.. దీనిపై విద్యార్థుల త‌ల్లిదండ్రులు స‌హ‌క‌రించాల‌ని మంత్రి కోరారు. ఫిబ్ర‌వ‌రి ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేసి, పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా 14 డిమాండ్లను పరిష్కరించాలని పాఠశాలల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంచెలంచెలుగా అన్ని తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు ఏడాదిగా ఫీజులు లేనందున పాఠశాలలు నిర్వహణ కష్టతరంగా మారిందని యాజమాన్యాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జూన్ వరకు విద్యా సంవత్సరం నిర్వహించాలని.. కనీస హాజరు ఉండేలా నిబంధన పెట్టాలని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం.

సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేపట్టాలన్నారు. వివిధ తరగతుల్లో సిలబస్‌ తగ్గింపుపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని.. ఇందుకు తల్లిదండ్రులు సహకరించాలని మంత్రి కోరారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ.. విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించినట్లు చెప్పారు. పాఠశాలలకు సంబంధించి పలు సమస్యలను ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత వరకు వారి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. పాఠశాలకు హాజరవని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వినేలా ఏర్పాట్లు చేయాలని సూచించామని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.