హార్టిక‌ల్చ‌ర్ విధాన రూప‌క‌ల్ప‌న‌కు కెసిఆర్ ఆదేశం

హైద‌రాబాద్ : తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని సిఎం కెసిఆర్ వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు మరింత విస్తరించే దిశగా పరిశోధనలు చేపట్టాల్సిన అవసరమున్నదని, ఈ నేపథ్యంలో హార్టికల్చర్ యూనివర్శిటీని బలోపేతం చేయాలని సీఎం సూచించారు.
ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక అంశంపై ప్రగతి భవన్‌లో వ్య‌వ‌సాయ‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి కెసిఆర్ శుక్ర‌వారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ హార్టికల్చర్ అభివృద్ధి దిశగా, ఆధునిక పద్ధతుల్లో ఉద్యానవన పంటల సాగుకోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉద్యానవన విశ్వవిద్యాలయం మౌలిక సౌకర్యాల రూపకల్పన అభివృద్ధి కోసం ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయరంగం మూస పద్ధతిలో సాగింది. ప్రాజెక్టుల కింద కాల్వల నీళ్లతో సాగయిన వరి పంటకే ఆనాటి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. తద్వారా సాగునీటి కొరత తీవ్రంగా నెలకొన్న తెలంగాణలో వ్యవసాయం బాగా వెనకబడిపోయింద‌న్నారు. తెలంగాణలో వ్యవసాయరంగాన్ని అంచనా వేయడంలో గత పాలకులు వైఫల్యం చెందార‌న్నారు. వ్యవసాయరంగానికి ఓ విధానం రూపొందించకపోవడం వల్ల నీటి కరువు ప్రాంతమైన తెలంగాణలో పండ్లు, కూరగాయలు, ఆకు కూరల్లాంటి తక్కువ నీటితో సేద్యమయ్యే ఉద్యాన వన పంటల సాగు చాలావరకు విస్మరించబడింది. పండ్లు, కూరగాయలు, పూల సాగులో ఉద్యానవన శాఖ ఇప్పుడెలా వుంది? భవిష్యత్తులో ఎలా ఉండాలో ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీఎం తెలిపారు.

తెలంగాణ నేల అద్భుతమైన సాగు స్వభావాన్ని కలిగి వున్నదని, ఇక్కడ కురిసే వర్షాలు, గాలి, వాతావరణం హార్టికల్చర్ పంటలకు అత్యంత అనుకూలమైనదని, ఉద్యానవన పంటలను తెలంగాణలో అద్భుతంగా పండించవచ్చని సీఎం అన్నారు.

ఉద్యానవనశాఖలో పని విధానాన్ని వికేంద్రీకరణ చేసుకోవాలని, ఇందుకు పని విభజన జరగాలన్నారు. ఇప్పుడు ఉద్యానవన శాఖకు ఒకే కమిషనర్ ఉన్నారని, ఇకనుంచి పండ్లు పండ్లతోటల సాగుకోసం, కూరగాయలు ఆకుకూరల సాగు కోసం, పామాయిల్ సాగు కోసం మొత్తంగా నలుగురు ఉన్నతాధికారులను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉద్యానవనశాఖలో తక్షణం పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని, తగినంతగా సిబ్బంది ఏర్పాటుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సిఎం సూచించారు.

ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామి రెడ్డి, హార్టికల్చర్ యూనివర్శిటీ వీసీ నీరజ, తదితర హార్టికల్చర్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.