`హిందువా.. ముస్లిమా కాదు.. వారు మేజ‌ర్లు`

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

లఖ‌న్‌పూ: దేశ వ్యాప్తంగా ల‌వ్ జిహాద్‌, మ‌తాంత‌ర వివాహాల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుండ‌గా ఉత్త‌ర ప్రదేశ్‌లోని అల‌హాబాద్ హైకోర్టు కీల‌క తీర్పును వెల్ల‌డించింది.  ముస్లిమైనా, హిందువైనా కోర్టుకు మతంతో సంబంధం లేదని, వారిద్దరూ మేజర్లా, కాదా అనేదే ముఖ్యమని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా ముస్లిం వ్యక్తిపై, యువతి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కులం, మతంతో సంబంధం లేకుండా తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సమంజసం కాదని హైకోర్టు పేర్కొంది. వివాహం కోసం మత మార్పిడిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. గతంలో ఇచ్చిన రెండు తీర్పులను సరైన తీర్పులుగా పరిగణించలేమని కోర్టు తెలిపింది.

యుపిలోని కుషీనగర్‌కు చెందిన సలామత్‌ అన్సారీ.. అదే ప్రాంతానికి చెందిన ప్రియాంక ఖన్వార్‌లు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి గత ఏడాది ఆగస్టులో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు మతం మారిన ప్రియాంక తన పేరును ఆలియాగా మార్చుకుంది. ఈ పెళ్లిపై ప్రియాంక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్‌ అయిన తన కుమార్తెను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంటూ సలామత్‌, మరో ముగ్గురిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో సలామత్‌, ప్రియాంకలు తాము మేజర్‌లమంటూ, జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు తమకుందని, ఈ కేసు కొట్టేసి తమకు రక్షణ కల్పించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే వివాహం కోసమే మత మార్పిడి చట్ట ప్రకారం చెల్లుబాటు కాదంటూ 2014, 2020లో కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. నూర్‌జహాన్‌, ప్రియాన్షిల కేసుల్లో తీర్పులు చట్ట ప్రకారం ఇవ్వలేదని, ఆర్టికల్‌ 21ని పరిగణలోకి తీసుకోలేదని ధర్మాసం పేర్కొంది.

ప్రియాంక, సలామత్‌లను హిందూ ముస్లింలుగా చూడలేమని, మేజర్లైన ఇద్దరు వ్యక్తులు తాము ఎంచుకున్న జీవిత భాగస్వామితో ఏడాది పాటు సంతోషంగా జీవిస్తున్నారని జస్టిస్‌ పంకజ్‌ నఖ్వీ, జస్టిస్‌ వివేక్‌ అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మెజర్‌ అయిన వ్యక్తికి జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు రాజ్యాగంలోని ఆర్టికల్‌ 21 కల్పించిందని, దీన్ని తిరస్కరిస్తే.. వారి వ్యక్తిగత స్వేచ్ఛనే కాకుండా జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుందని తెలిపింది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించేందుకు చట్టం (ఆర్టికల్‌ 377) అనుమతించినపుడు.. ఇద్దరు వ్యక్తులు స్వేచ్ఛగా తమ భాగస్వామిని ఎంచుకుని జీవిస్తున్నపుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో అర్థం చేసుకోలేకపోతున్నామని ధర్మాసనం పేర్కొంది. కాగా, ఈ తీర్పు నవంబర్‌ 11న వెలువడగా.. సోమవారం వెలుగులోకి వచ్చింది.

మ‌తాంత‌ర వివాహాల‌పై దేశవ్యాప్తంగా పెద్ద చ‌ర్చ జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. మ‌ధ్య ప్ర‌దేశ్‌, యుపి, హ‌రియాణ లాంటి రాష్ట్రాలు ఏకంగా ల‌వ్ జిహ‌ద్‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టం తీసుకురావాల‌నే యోచ‌న‌లో ఉన్నాయి. తీర్పు లవ్‌ జీహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలను రూపొందించేందుకు యత్నిస్తున్న ప్రభుత్వాల‌కు ఈ తీర్పు అడ్డంకిగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.