హిట్‌మ్యాన్ షో.. భార‌త్ 300/6

చెన్నై: ఇంగ్లాండ్‌తో జ‌రుగుతోన్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ (161: 231 బంతుల్లో) ఆక‌ట్టుకున్నాడు. మ‌రో బ్యాట్స్‌మన్ ర‌హానె(67: 149 బంతుల్లో)తో క‌లిసి భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. వీరిద్ద‌రూ 162 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. తొలిరోజు, శ‌నివారం ఆట ముగిసేస‌మ‌యానికి భార‌త్ 88 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 300 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం రిష‌బ్ పంత్‌(33 56 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌), అక్ష‌ర్ ప‌టేల్‌(5) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జాక్ లీచ్, మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు తీయ‌గా జో రూట్‌, ఓలీ స్టోన్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. యువ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ పేలవరీతిలో వికెట్‌ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్‌ 2వ ఓవర్‌ వేసిన ఫాస్ట్‌ బౌలర్‌ ఓలీ స్టోన్‌ బౌలింగ్‌లో బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన గిల్‌ (0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆపై వన్‌డౌన్‌లో వచ్చిన చెతేశ్వర్‌ పుజారాతో కలిసి రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. చెన్నై పిచ్‌ బౌలర్లకు సహకరిస్తున్నా.. వన్డే తరహాలో దూకుడుగా ఆడి పరుగులు సాధించాడు. ఫుల్‌, కట్‌ షాట్లతో ఫ్రంట్‌ ఫుట్‌పైకి వచ్చి మరీ రోహిత్‌ భారీ షాట్లు ఆడుతూ 47 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ఇదే సమయంలో ఇంగ్లాండ్‌ బౌలర్లు పుంజుకుని వరుస ఓవర్లలో పుజారా (21 : 58 బంతుల్లో), విరాట్‌ కోహ్లీ (0)ని పెవిలియన్‌కు చేర్చారు. దీంతో భారత్‌ 86 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆపై రోహిత్‌, రహానే నాలుగో వికెట్‌కు 162 పరుగులు జోడించారు. రెండో సెషన్‌లో వికెట్‌ కోల్పోకుండా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలో రోహిత్‌ 130 బంతుల్లో శతకం అందుకున్నాడు. మరోవైపు రహానే 104 బంతుల్లో అర్ధ శతకం సాధించడంతో టీ విరామానికి భారత్‌ 189/3తో పటిష్ట స్థితిలో నిలిచింది.

హిట్‌మ్యాన్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు. చాలా వేగంగా శ‌త‌కం సాధించిన రోహిత్ డ‌బుల్ సెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్లాడు. టీమ్ ఇండియా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. రోహిత్ జాక్ లీచ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. మొయిన్ అలీ వేసిన 76వ ఓవ‌ర్లోనే ర‌హానె బౌల్డ్ అయ్యాడు. చివ‌ర్లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన అశ్విన్ త్వ‌ర‌గానే ఔట‌య్యాడు. మ‌రో ఎండ్‌లో పంత్ మాత్రం త‌న‌దైన శైలిలో హిట్టింగ్ చేసి స్కోరు 300 దాటించాడు.

 

Leave A Reply

Your email address will not be published.