హైదరాబాద్‌లో కన్నతల్లి ఘాతుకం
పసిబిడ్డను మేడపై నుంచి కిందపడేసిన తల్లి

హైదరాబాద్:భర్త మీద కోపంతో ఓ తల్లి తన 14 రోజుల వయసున్న పసిబిడ్డను భవనంపై నుంచి కిందకు పడేసింది. ఈ అమానుషమైన ఘటన సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ నేతాజీనగర్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్‌కు చెందిన వేణుగోపాల్‌కు ఫతేనగర్ నేతాజీనగర్‌కు చెందిన లావణ్యతో 2016 అక్టోబర్‌లో వివాహం జరిగింది. వీరికి ఓ బాబు జన్మించాడు. ఆ తర్వాత దంపతులిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో లావణ్య మళ్లీ గర్భవతి అయింది. డెలివరీ కోసం అమ్మగారి ఇల్లైన నేతాజీనగర్‌కు వచ్చింది. కుటుంబ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గత నెల 29న పురుగుల మందు తాగి లావణ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే మరుసటి రోజు(అక్టోబర్ 30)న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి లావణ్య తన తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు భర్తపై ఉన్న కోపం తగ్గకపోవడంతో శుక్రవారం(నవంబర్ 13) రోజున 14 రోజుల పసిబిడ్డను తానుంటున్న భవనం మూడో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు. లావణ్య భర్త వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సనత్ నగర్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.