AP HighCourt: కొవిడ్ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాలు..
అమరావతి (CLiC2NEWS): ఎపిలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి హైకోర్టు కీలక సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహ ప్రతిష్టకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో ప్రైవేటు స్థలాల్లో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఎపి హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలు సాటిస్తూ వినాయక ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్సవాలలో ఐదుగురు వ్యక్తులకు మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చని ప్రజలకు సూచించింది. పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. కేవలం పైవేటు స్థలాల్లో మాత్రమే విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించాలని ఆదేశాలిచ్చింది.
పబ్లిక్ ప్రాంతాల్లో విగ్రహాలు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు ప్రజలకు అధికారం ఉందని పేర్కొంది. నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనల మేరకు పూజలు నిర్వహించుకోవాలని సూచించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ప్రతిష్టకు అనుమతి నిరాకరిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.