1.40 లక్షల పోస్టుల భర్తీకి రైల్వే రెడీ..

న్యూఢిల్లీ: ఇది  నిరుద్యోగుల‌కు శుభ‌వార్తే. డిసెంబరు 15 నుంచి 1,40,640 పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే రెడీ అవుతోంది. ఇందులో భాగంగా పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది.ఈ మేర‌కు రైల్వే బోర్డు చైర్మ‌న్ వినోద్‌కుమార్ యాద‌వ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు..   మొత్తం 1,40,640 పోస్టుల భర్తీ కోసం రైల్వే నోటిఫికేషన్ జారీ చేయగా, 2.42 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్క్రూటినీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావడంతో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించేందుకు రైల్వే సన్నద్ధమవుతోందని తెలిపారు. పూర్తి షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. రైల్వేలో ప్రస్తుతం మూడు కేటగిరీల్లో ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు కరోనా వ్యాప్తికి ముందే దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే, ఆ తర్వాత దేశంలో వైరస్ కేసులు పెరిగిపోవడం, లాక్‌డౌన్ కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయింది. నాన్ టెక్నికల్ పాప్యులర్ కేటగిరీలైన గార్డులు, ఆఫీస్ క్లర్క్, కమర్షియల్ క్లర్క్ విభాగాల్లో 35,208 పోస్టులు, ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రీరియల్ కేటగిరీలైన స్టెనో, టీచెస్ వంటి వాటిలో 1,663 పోస్టులు, ట్రాక్ మెయింటెనెన్స్, పాయింట్స్‌మేన్ వంటి లెవల్ 1 విభాగంలో 1,03,769 ఖాళీలు ఉన్నాయి. పరీక్షలకు సంబంధించి త్వరలోనే షెడ్యూలు విడుదల చేయనుంది.

 

 

Leave A Reply

Your email address will not be published.