10 వేల మంది చిన్నారులకు విరాట్ కోహ్లీ సాయం!

న్యూఢిల్లీ : భారత సారథి, ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున
క్రికెటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ.. ‘వైజ్ (vize)’ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సానిటేజర్ ప్రొడక్ట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా 10 వేల మంది చిన్నారులకు సాయం అందించబోతున్నాడు విరాట్ కోహ్లీ…
అయితే ఈ ఒప్పందం ద్వారా తనకు వచ్చే ఆదాయాన్ని మహారాష్ట్రలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఖర్చు చేయనున్నాడు. ఈ నిరుపేద, అభాగ్యుల ఆలనాపాలన చూస్తున్న ‘రా ఫౌండేషన్’కు ఈ మొత్తాన్ని కోహ్లీ విరాళంగా అందజేయనున్నాడు. ఇక ఈ గొప్ప పనిలో భాగస్వామ్యం అవుతున్నందుకు గర్వపడుతున్నానని విరాట్ తెలిపాడు.
‘నేను ఈ గొప్ప పనిలో భాగం అవుతున్నందుకు గర్వపడుతున్నా. దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు సాయంగా ‘వైజ్’ సంస్థ ద్వారా నాకు వచ్చే ఆదాయాన్ని విరాళంగా ప్రకటిస్తున్నా. క్రీడాకారులకు మీ ప్రేమ ఆదరాభిమానాలే పెద్ద ఆస్తి. కానీ ఈ కరోనా విపత్కర కాలంలో కోవిడ్-19 వారియర్సే నిజమైన హీరోలు. వారు వాళ్ల ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ ఇతరులను కాపాడుతున్నారు. వైజ్‌తో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.