వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు `దళితబంధు`
అకౌంట్లలో రేపే 10 లక్షల చొప్పున జమ: సిఎం కెసిఆర్

వాసాలమర్రి (CLiC2NEWS): వాసాలమర్రి గ్రామంలోని 76 ఎస్సీ కుటుంబాలకు దళితబంధు పథకం మంజూరుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. సిఎం యాదాద్రి భువనగిరి జిల్లాలో దత్తత గ్రామమైన వాసాలమర్రిలో బుధవారం పర్యటించారు. అధికారులతో కలిసి దళితవాడలో పర్యటించారు. స్థానికంగా ఉన్న 60 కుటుంబాలతో సిఎం సమావేశమయ్యారు. గ్రామంలోని అందరికీ ఒకే విడతలో దళితబంధు నిధులు పంపిణీ చేస్తామని సిఎం పేర్కొన్నారు. రేపట్నుంచే దళితుల చేతుల్లో రూ. 10 లక్షల చొప్పున డబ్బులు ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వాసాలమర్రి గ్రామానికి దళిత బంధు కోసం రూ. 7.60 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నానని సీఎం ప్రకటించారు. దళిత బంధు నిధులను ఒకే విడుతలో పంపిణీ చేస్తామన్నారు. ఆలేరు నియోజకవర్గంలో రూ. 30 కోట్లతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
గ్రామంలో ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ఉందని ప్రభుత్వ మిగులు భూమిని ఎస్సీ కుటుంబాలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
వాసాలమర్రి పర్యటనలో సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎం కెసిఆర్ ప్రసగింస్తూ..
“ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రం సాధించుకున్నాం.ఈ ఆరేళ్లలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. విద్యుత్, తాగునీరు సమస్య తీరింది. కులవృత్తులపై ఆధారపడిన వారిని ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నాం. ప్రభుత్వ పథకాలు తెచ్చినా వాటిపై ప్రజల్లో అవగాహన కొరవడింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గడం వల్ల కొన్ని పథకాల అమలు పెండింగ్‌లో ఉంది. ఏదేమైనా దళిత బంధు పథకం అమలు చేసి తీరుతాం.“ అని కెసిఆర్ తెలిపారు.
సర్కార్ ఏదన్నా సాయం చేసినప్పుడు.. ఆరునూరైనా సరే ఏ పథకం కూడా నీరుగారి పోవద్దు. పట్టుబట్టి చాలా గట్టిగా మొండి పట్టుదలతో పైకి రావాలి. దళిత వాడల్లో బాగా ఐకమత్యం రావాలి. అందరూ ఒకటిగా ఉండి.. పోలీసు కేసులకు దూరంగా ఉండాలి. కేసులను రద్దు చేసుకుని, ప్రేమ భావంతో మెలగాలి. ఒక నియోజకవర్గం(హుజురాబాద్) మొత్తం తీసుకుని దళితబంధును అమలు చేస్తున్నాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఈ గ్రామంలో మొత్తం 76 దళిత కుటుంబాలు ఉన్నాయి. వాసాలమర్రిలో 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ మిగులు భూమి ఉంది. ప్రభుత్వ మిగులు భూములను దళిత కుటుంబాలకు పంపిణీ చేస్తాం. దళితుల భూమిని మరెవ్వరూ తీసుకునే అర్హత లేదు. ప్రతి దళిత బిడ్డ రైతు కావాలి. వాసాలమర్రిలో కొత్త చరిత్ర సృష్టించాలి అని సీఎం కేసీఆర్ తెలిపారు.
“ఇవాళ గ్రామం మొత్తం తిరిగాను. కొన్ని ఇండ్లు మట్టితో ఉన్నవి. ఒక్కటి కూడా ఇటుకల ఇల్లు కనబడలేదు. కూలిపోయే దశలో ఇండ్లు ఉన్నాయి. వరద నీళ్లు ఇండ్లలోకి వచ్చే విధంగా గ్రామం ఉంది. మొత్తం ఊరు కూలగొట్టి.. మంచిగా చేసుకుందాం. గతంలో ఎర్రవల్లిలో ఇళ్లన్నీ పడగొట్టి కొత్త ఇళ్లు నిర్మించి ఇచ్చాం. గ్రామస్థులను 6 నెలలు గుడారాల్లో ఉంచి ఇళ్లు నిర్మించి ఇచ్చాం. వాసాలమర్రిలో కూడా అదేవిధంగా కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం“ అని కెసిఆర్ తెలిపారు.